కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైసిపి అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్, బిజెపి, జనసేన బలపరిచిన టిడిపి అభ్యర్థిగా బోడే ప్రసాద్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసిపి, టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థులు జోగి, బోడే, వెలిశెల మధ్య ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు శ్రమిస్తున్నారు. ఒకరికొకరు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.
టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి
ప్రస్తుత ఎన్నికల్లో జిల్లాలో మొదటిసారి పెనమలూరు నియోజకవర్గంలో అధికార వైసిపికి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీరుపై విమర్శలు చేశారు. ఆ తర్వాత వైసిపిని వీడి టిడిపిలో చేరారు. ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో వైసిపిని వీడి టిడిపిలో చేరారు. ఈ పరిస్థితుల్లో పెనమలూరు సీటును మంత్రి జోగి రమేష్‌కు వైసిపి కేటాయించింది. ఆయన ఈ నియోజకవర్గానికి కొత్త. పెడన నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన జోగి సీటును వైసిపి అధిష్టానం మార్పు చేసి పెనమలూరుకు పంపింది.
ఎన్నికల షెడ్యూల్ కు ముందు పెనుమలూరు వచ్చిన జోగి రమేష్
ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఆయన పెనమలూరు నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఆత్మీయ సమావేశాల పేరుతో తాయిలాలు పంపిణీ చేసి పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. బోడే ప్రసాద్ కు టిడిపి తొలుత టికెట్ నిరాకరించింది. తనకు టికెట్ కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని తెగేసి చెప్పారు. కొన్నిరోజులు టిడిపి జెండా లేకుండానే స్వతంత్రంగా ప్రచారం చేశారు. చివరికి సీటు దక్కించుకున్నారు. ఇప్పుడు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.
జోగి స్థానికేతర అంశం – మంత్రిగా వ్యతిరేకత
వైసిపి ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో గృహ నిర్మాణశాఖ మంత్రిగా జోగి రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన ఐదేళ్లలో పెడనలో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు, సముద్రతీర ప్రాంత భూముల ఆక్రమణలు, పేకాట శిబిరాల నిర్వహణ వంటివి విచ్చలవిడిగా సాగాయనే ఆరోపణలున్నాయి. వీటితో పాటు పెనుమలూరుకు ఆయన కొత్త. మైలవరం నుంచి పోటీ చేయాలని అనుకున్నా జగన్ పెనుమలూరు నుంచి పోటీ చేయమని ఆదేశించడంలో తప్పలేదు. ఇప్పుడు గెలిచేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది.