కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విజయవాడ వచ్చి చంద్రబాబు,జనసేన నేతలతో సమావేశం అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. ఇందులో రాజకీయ వ్యూహాలు ఎక్కువగా చర్చకు వచ్చాయి. ఏపీ అభివృద్ధికి ఎన్నో సహజ వనరులు ఉన్నాయని, ఈ ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదని అందుకే ప్రజాగ్రహం ఎక్కువగా ఉందని గుర్తించారు. కార్మికులు, రైతులు, యువతను అసలు పట్టించుకోలేదని, వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ స్వార్ధ ప్రయోజనాలే చూసుకున్నారని నిర్ణయానికి వచ్చారు.
వైసీపీ పాలనపై చార్జిషీట్
శాండ్ , ల్యాండ్ , లిక్కర్ మాఫియాలతో కోట్ల రూపాయలు వైసీపీ దోచుకుందన్న అభిప్రాయం వ్యక్తమయింది. ఈ మేరకు చార్జిషీటును కూటమి విడుదల చేసింది. ప్రధానమంత్రి మోదీ ఆవాస్ యోజన కింద 23లక్షలు ఇళ్లు ఏపీకి కేటాయించారని, కేవలం మూడున్నర లక్షల ఇళ్లు మాత్రమే జగన్ ప్రభుత్వం నిర్మాణం చేసిందని పీయూష్ గోయల్ మీడియాకు చెప్పారు. కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని, అనేక ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
భూములివ్వకపోవడం వల్లనే రైల్వే జోన్ ఆలస్యం
విశాఖ రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలో పెట్టారని, కానీ రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూములు జగన్ ప్రభుత్వం కేటాయించలేకపోయింది. పంచాయతీలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం చేశారు.గ్రామాల అభివృద్ధి లేకుండా జగన్ సొంత అవసరాలకు డబ్బులు వినియోగించారని, ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చారజ్ షీట్‌లో బీజేపీ పేర్కొంది. ప్రధాని మోదీ పదేళ్లలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తింపు తెచ్చేలా చేశారని, అభివృద్ధి, సంక్షేమం సమానంగా తీసుకెళ్లి ఆదర్శ పాలన అందించారని పీయూష్ గోయల్ తెలిపారు.
మోదీపై ఏపీ ప్రజల్లో సానుకూలత
మోదీ మేక్ ఇండియా 2047 లక్ష్యాలను సాధించాలని, యువత ఇందులో కీలక పాత్ర పోషించాలని పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పేదల కోసం పూర్తిగా ఉచిత బియ్యం మోదీ అందిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల ఉచిత వైద్య సేవలు కల్పిస్తున్నారు. ప్రతి ఇంటికి కుళాయి, మరుగుదొడ్డి నిర్మాణం సాకారం చేశారు. జల జీవన్ మిషన్ ద్వారా మంచి నీటికొరత లేకుండా చేశారు, నారీ శక్తి ద్వారా మహిళలు వివిధ రంగాల్లో నిలబడేలా చేశారని, స్వతంత్య్రంగా ఎదగడానికి అనేక రుణాలు అమల్లోకి తెచ్చారు, ఏపీలో అనేక కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలను నెలకొల్పారు. వీటన్నింటితో ఏపీలో కూటమిపై సానుకూలత పెరిగిందని నిర్ణయానికి వచ్చారు.