ప్రధాని మోదీ మాట్లాడితే ఓ సమ్మోహనాస్త్రం వేసినట్లేనంటారు. అన్ని వర్గాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే ఆయన మాట్లాడతారు. ప్రతీ ఒక్కరికీ ఏమి కావాలో మోదీకి తెలుసు. అందుకే ఇంతకాలం బీజేపీకి బలం లేని ప్రాంతాల్లో కూడా ఆయన దూసుకుపోతున్నారు. మోదీ వస్తున్నారంటే జనం ఆయన్ను చూసేందుకు బారులు తీరుతున్నారు. ఇటీవల దక్షిణ చెన్నై నియోజకవర్గంలో నిర్వహించిన మోదీ రోడ్ షో ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు….
కర్ణాటక తర్వాత తమిళనాడే కీలకం…
దక్షిణాదిన కర్ణాటక తర్వాత తమిళనాడులో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో మోదీ,తరచూ తమిళనాడు వచ్చి వెళ్తున్నారు. తమిళ చరిత్ర, సంస్కృతీపై ఉపన్యాసాలు ఇస్తున్నారు. తమిళ మేధావులను పిలిచి పార్టీ విధానాలను వివరిస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోపై సెంగోళ్ ముద్రించిన తీరు…తమిళనాడు పట్ల బీజేపీకి పెరిగిన ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.
తగ్గుతున్న డీఎంకే ఓట్ షేర్ …
స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, తమిళనాడులో అధికారంలో ఉంది. ఆ పార్టీ ఈసారి కూడా కాంగ్రెస్ తో పొత్తుగా పోటీ చేస్తోంది. రాష్ట్రాల హక్కుల వ్యవహారంపై డీఎంకే ఎక్కువగా పోరాడుతోంది. ఉత్తరాదికి ఎక్కువ నిధులిచ్చి దక్షిణాదిని చిన్నచూపు చూస్తున్నారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. పైగా దక్షిణాది ప్రజలు కుటుంబ నియంత్రణను పాటిస్తుంటే… ఇప్పుడు జనాభా తక్కువ ఉందని చెబుతూ పార్లమెంటు నియోజకవర్గాలను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని డీఎంకే మరో ఆరోపణ చేస్తోంది. అయితే ఇదంతా ఒట్టిమాటేనని దక్షిణాది, ఉత్తరాది ఒకటేనని ఇటీవల ఎఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ కుండబద్దలు కొట్టారు. డీఎంకే ఓట్ షేర్ 16 శాతానికి మించి ఉండదని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. తమిళనాడులో మొత్తం 39 లోక్ సభా నియోజకవర్గాలున్నాయి .బీజేపీ 23 చోట్ల బరిలోకి దిగుతోంది. పది సీట్లు పీఎంకేకు వదిలేసింది మిగతావి చిన్న పార్టీల ఖాతాలోకి వెళ్లిపోయాయి. అన్నాడీఎంకేను వదిలించకోవడం వల్ల తమకు మంచి జరిగిందని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు..
ద్రవిడ ఐడీయాలజీ నచ్చని యువత
శతాబ్దం పైగా తమిళనాడులో ద్రవిడ ఉద్యమ ఐడియాలజీ కొనసాగింది. దేవుడిని నమ్మని పెరియార్ ఈవీ రామస్వామి నాయకారే వాళ్లకు పెద్ద నాయకుడు. సంఘసంస్కర్తగా పేరు తెచ్చుకున్న పెరియార్…. జనాన్ని మాత్రం సంఘటితంగా ఉంచలేకపోయారు. ఇప్పుడు తొలి సారి ఓటు వేస్తున్న యువతకు మాత్రం ద్రవిడ ఉద్యమం, దాని సిద్ధాంతాలపై పెద్దగా ఆసక్తి లేదు. అత్యాధునిక భారతావని కావాలన్నదే వారి ఆకాంక్ష. వారి చదువులు, ఉద్యోగావకాశాలు, జీవితాన్ని మలుచుకోవడం లాంటి అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. యువతకు కావాల్సిందేమిటో బీజేపీకి, మోదీకి బాగా తెలుసు. అందుకే వారిని ఆకట్టుకోగలుగుతున్నారు…..