ఎన్నికల వ్యవస్థ విచిత్రంగా ఉంటుంది. ఓడినోడు బయటే ఏడుస్తాడు, గెలిచినోడు ఇంటికి పోయి చేసిన ఖర్చు లెక్కపెట్టుకున్న తర్వాత తలుపులు వేసుకుని ఏడుస్తాడని పాత సామెత ఒకటి ఉంది. ఎందుకంటే రాను రాను ఎన్నికల వ్యయం తడిసిమోపేడవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఓడిపోవడం, గెలవడం కంటే డిపాజిట్లు కోల్పోయిన వారి పరిస్థితి ఏమిటన్నది కూడా తరచూ చర్చనీయాంశమవుతూనే ఉంది. తగిన ఓట్లు రాని వారు నామినేషన్ సమయంలో చెల్లించిన డిపాజిట్ కూడా వదులుకోవాల్సిందే….
డిపాటిల్ కోల్పోయిన 21వేల మంది ..
2009 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికలను ఓ సారి పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించకమానవు. ఆ మూడు ఎన్నికల్లో పోటి చేసి డిపాజిట్ కోల్పోయిన వాళ్లు 21 వేల మంది ఉన్నారు. నగదు రూపంలో లెక్క చెప్పాలంటే అది రూ. 46 కోట్ల రూపాయలు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ వ్యక్తి రూ. 25 వేల రూపాయలు డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే అందులో సగం సొమ్మును డిపాజిట్ గా చెల్లిస్తే సరిపోతుంది….
1999 నుంచి ఇదే ట్రెండ్…
ఎన్నికల పరిశీలకులు వేసిన అంచనా ప్రకారం 1999 నుంచి నాన్ సీరియస్ అభ్యర్థులు పెరిగిపోతున్నారు. అప్పటి నుంచి డిపాజిట్లు కోల్పోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. భారతీయ ఎన్నికల పరిభాషలో చెప్పాలంటే దాన్ని జమానత్ జప్త్ అంటారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో 8 వేల 70 మంది పోటీ చేస్తే, అందులో 6 వేల 829 మంది డిపాజిట్ కోల్పోయారు. 2014 ఎన్నికల్లో 8 వేల 251 మంది అభ్యర్థులకు గాను 7 వేల మందికి జమానత్ జప్తు అయ్యింది. 2019 ఎన్నికల్లో 8 వేల 54 మంది బరిలోకి దిగారు. అందులో 6 వేల 923 మంది కట్టిన డిపాజిట్లు తిరిగి పొందలేకపోయారు. 2009 నుంచి 2019 మధ్య జరిగిన మూడు లోక్ సభ ఎన్నికల్లో 24 వేల 375 మంది అభ్యర్థులు పోటీ చేస్తే.. వారిలో 20 వేల 752 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి మిగిలిన డిపాజిట్ సొమ్ము రూ. 44 కోట్ల వరకు ఉంది.
తొలి నాళ్లలో డిపాజిట్ తక్కువే…
స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో అభ్యర్థులు చెల్లించే డిపాజిట్ సొమ్ము చాలా తక్కువగా ఉండేది. అప్పట్లో జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ. 500 డిపాజిట్ చెల్లిస్తే సరిపోయేది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ. 250 డిపాజిట్ చెల్లించాలి. 1951లో జరిగిన తొలి ఎన్నికలో 9,067 మంది డిపాజిట్ కోల్పోయారు. దాని విలువ రూ. 22.80 లక్షలు. అప్పుడే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రూ.3.51 డిపాజిట్ పోయింది. ఈ గణాంకాలు చూస్తుంటే.. డబ్బుపోయినా ఫర్యాలేదు పోటీ చేయాలన్న తపన భారతీయుల్లో కనిపిస్తోంది. అదే మన ప్రజాస్వామ్యానికి ఉన్న పవర్…