గుంటూరు వైసీపీలో గందరగోళం – టీడీపీలో చేరిన జడ్పీ చైర్మన్ కత్తెర క్రిస్టినా

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, ఆమె భర్త సురేష్‌కుమార్‌ శుక్రవారం బాపట్ల జిల్లా కొల్లూరులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరడంతో వైసిపి నాయకులు ఖంగుతి న్నారు. ఆమె సీఎంజగన్ కుటుంబానికి సన్నిహితురాలు. వారు క్రైస్తవ మత సంస్థల్ని నడుపుతూంటారు. అయినా టీడీపీలో చేరడంతో వైసీపీ నేతలు షాక్ కు గురయ్యారు.

టీడీపీకి ఉన్నది ఒక్క జడ్పీటీసీనే

57 మంది సభ్యులున్న జిల్లా పరిషత్‌లో టిడిపికి కేవలం ఒక్క జెడ్‌పిటిసి మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఆమె పదవిలో కొనసాగే అవకాశం ఉంది. కానీ ముందస్తు వ్యూహంతో ఆమె టిడిపిలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని, అప్పుడయినా తమకు ఇబ్బందులు తప్పవని భావించి ముందుగానే టిడిపిలో చేరారని తెలిసింది. వైసిపిలో తమకు గుర్తింపు లేదని, కనీసం తమకు సిఎం అప్పాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని క్రిస్ట్రినా ఆరోపించారు. నిధులు కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయిందని ఆమె సిఎం జగన్‌కు పంపిన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.

టిక్కెట్ ఇవ్వలేదని అసంతృప్తి

జెడ్‌పి చైర్‌పర్సన్‌గా 2021 సెప్టెంబరు 25న ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు 2014 ఎన్నికల్లో తాడికొండ నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 వరకు వైసిపి తాడికొండ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఆమె పదవీ కాలం 2026 వరకు ఉంది. అయితే గతేడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి వైసిపికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత కత్తెర సురేష్‌కుమార్‌ను తాడికొండ వైసిపి సమన్వయకర్తగా నియమించారు. వైసిపి తాడికొండ టిక్కెట్‌ వస్తుందని భావించి ఆయన చురుగ్గా పనిచేశారు. తీరా ఇటీవల అభ్యర్థుల ఎంపికలో తాడికొండ సీటు మేకతోటి సుచరితకు ఇవ్వడం, ప్రత్యామ్నాయంగా ఎక్కడా పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన నాలుగు నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయినా జిల్లా నాయకులెవ్వరూ పట్టించుకోలేదు.

పదవి నుంచి తొలగించలరా ?

ఇప్పుడు క్రిస్టినాను పదవి నుంచి ఎలా తొలగించాలా అనే అంశంపై వైసిపి నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్థానం ఎస్‌సి మహిళకు రిజర్వు చేయడంతో వైసిపి నుంచి క్రిస్టినాకు అవకాశం కల్పించారు. 2021 ఎన్నికలల్లో ఆమె చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైసిపికి వీర విధేయులుగా ఉన్న క్రిస్టినా దంపతులు తాడికొండ పరిణామాలపై మనస్తాపంతోనే పార్టీకి దూరమయ్యారని ప్రచారమవుతోంది. పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.