ఆనపర్తిలో పొత్తు ధర్మం ఏది ? – బీజేపీ అభ్యర్థిని అవమానిస్తున్న వీడియో వైరల్ !

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో చేరిన టీడీపీ ఆ స్ఫూర్తిని ఏపీలో కొనసాగించలేకపోతోంది. పొత్తుల్లో భాగంగా ఆనపర్తి నియోజకవర్గం బీజేపీకి వచ్చింది. కానీ అక్కడ అభ్యర్థి విషయంలో మాత్రం అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బుజ్జగించకపోగా ఆయనకే టిక్కెట్ వస్తుందన్న నమ్మకాన్ని కలిగిస్తూండటంతో అనుచరులు రెచ్చిపోతున్నారు. బీజేపీ అభ్యర్థి మెడలో కండువాను కూడా తీయించేలా పరిస్థితులు దిగజారాయి.

ఆనపర్తి బీజేపీ అభ్యర్థికి అవమానం

తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పొత్తులు అపహాస్యం అవుతున్నాయి. బీజేపీ అభ్యర్థి, మాజీ సైనికుడు శివకృష్ణంరాజుకు ఇప్పటికే టికెట్‌ కేటాయించినా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సహకరించడం లేదు. మాజీ సైనికుడైన శివకృష్ణంరాజుకు ప్రత్యక్ష రాజకీయాల్లో స్థానం కల్పించి, అనపర్తి ఎమ్మెల్యే టికెట్ ని కేటాయించడం ద్వారా చిత్తశుద్ధిని చాటుకుంది బీజేపీ కేంద్ర నాయకత్వం. విలువలు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీ అని నిరూపించుకుంది. అయితే ఎంతో ప్రతిష్టాత్మంగా మాజీ సైనికుడికి కోసం కేటాయించిన ఈ సీటులో పొత్తు ధర్మం ప్రకారం సహకరించాల్సింది పోయి..అవమానిస్తున్నారు. ప్రచారం చేయడానికి వెళ్తే టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని కండువాని తీయించేశారు.

బీజేపీ పెద్దలు మెతకగా ఉన్నందువల్లేనా ?

బీజేపీ ఇప్పటికే టికెట్‌ కేటాయించిన శివకృష్ణంరాజుది ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీ కుటుంబమే. ఆయన తండ్రి బీజేపీకి పని చేశారు. తన తండ్రి వైద్యం కోసం ఆర్మీకి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని వచ్చిన శివకృష్ణంరాజు క్రమంగా జిల్లా బీజేపీలో క్రియాశీలకంగా మారారు. 4 సంవత్సరాలుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సంవత్సరకాలంగా అనపర్తి నియోజకవర్గ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. అలాంటి నేతకు టిక్కెట్ వచ్చినా పొత్తుల్లో ఇతర పార్టీలు సహకరించకపోవడం.. నాయకత్వం కూడా మెతకగా ఉండటం వల్ల సమస్యలు వస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.

మార్పు చేస్తారన్నప్రచారంతో మరింత గా టీడీపీ కార్యకర్తల దూకుడు

బీజేపీ స్థానాన్ని మారుస్తారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ అంశంపై టీడీపీ వైపు నుంచి కానీ.. బీజేపీ వైపు నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. ముందుగా బీజేపీ నుంచి ఏదైనా సూచన రావాలి. ఎందుకంటే.. అది బీజేపీకి దక్కని సీటు. అయినా ఏమీ చెప్పకుండానే టీడీపీ నేతలు మార్పు చేస్తారని ప్రచారం చేస్తూండటంతో.. ఒత్తిడి పెంచేందుకు మరింత ఎక్కువగా హంగామా చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. దీన్ని కంట్రోల్ చేయకపోతే పొత్తు ధర్మం అపహాస్యం పాలవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.