గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయ్. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. విపరీతమైన వేడి కారణంగా అనారోగ్య సమస్యలు తప్పవు. వాటిలో ముఖ్యమైనది వడదెబ్బ. శరీరం వేడిని తట్టుకునే స్థాయి దాటిపోతే అప్పుడు హీట్ స్ట్రోక్ వస్తుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు..
పొడి వాతావరణం కారణంగా కొన్నిసార్లు చెమట పట్టదు..ఫలితంగా చెమట తొలగింపు వ్యవస్థ పని చేయడంలో విఫలమైతే శరీరం వేడెక్కుతుంది. హీట్ స్ట్రోక్ వస్తుంది. దీంతో కొంత మంది స్పృహతప్పి కిందపడిపోతారు. మరికొందరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు హీట్ స్ట్రోక్ మరణానికి కూడా దారితీయవచ్చు. వడదెబ్బ లక్షణాలు ఇలా ఉంటాయి…
@ వాంతులు, వికారం, మూర్ఛ, వేగవంతమైన శ్వాస
@ గందరగోళంగా అనిపించడం, విపరీతమైన చెమట, శ్వాస ఆడకపోవటం
@ చెమట పట్టకుండా పొడి చర్మం లేదంటే ఎరుపు చర్మం
@ తక్కువ మూత్రవిసర్జన కూడా వడదెబ్బ సూచనే
వడదెబ్బ నుంచి రక్షణ ఇలా!
సాధారణ రోజుల కంటే నీరు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. చక్కెర పానీయాలు, స్టోర్లలో లభించే పానీయాలను తీసుకోవద్దు. మీ శరీరం నుంచి చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడానికి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఉష్ణోగ్రతను నియంత్రించే మీ శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎండ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వదులుగా ఉన్న కాటన్ బట్టలు, టోపీ ధరించడం మంచిది. అత్యవసరం అయితే కానీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లడం మంచిది కాదు. మీ ఇంటిని చల్లగా ఉంచడానికి ఎయిర్ కండిషనింగ్ మరియు ఫ్యాన్లను ఉపయోగించండి. బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. వేడి వాతావరణంలో బహిరంగ వ్యాయామం, కఠినమైన శారీరక శ్రమను నివారించండి. తలనొప్పి, గందరగోళం అనిపిస్తే వెంటనే కాసేపు రెస్ట్ తీసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా ముఖానికి మాస్క్, కళ్లకు కళ్లజోడు ధరించాలి. చెవులు ముక్కుకి మాస్క్ పెట్టుకోవాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.