ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ-బీజేపీ బేరసారాల ఆడియో కలకలం రేపుతోంది. రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి బీజేపీ నేతలు ఆఫర్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ప్రస్తుతం టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయన అక్కడ్నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఆ సీటును బీజేపీ కోరుతోంది. ఇంకా ఫైనల్ కాలేదు. ఆదోని లేదా ఆలూరు సీట్లలో ఏదో ఒకటి తీసుకోవాలని తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదోని సీటు వదులు కావాలంటే 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతలు ప్రతిపాదించారు.
బీజేపీలో ఇలాంటి గందరగోళం గతంలో ఉందా ?
బీజేపీలో సైతం కలకలం రేపుతున్న ఈ ఆడియో సంభాషణ బీజేపీ నాయకుడు అయిన కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు నాగరాజు , టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య జరిగింది. ఎవరు లీక్ చేశారో కానీ.. ఈ వ్యవహారం అటు ఆదోనిలో.. ఇటు ఆలూరులోనూ కలకలం రేపుతోంది. ఈ అంశంలో పురందేశ్వరిని కూడా తీసుకు రావడంపై.. బీజేపీ అగ్రనేతలు సైతం ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీ కి కేటాయించిన సీట్ల విషయంలో అభ్యర్థుల మధ్య పోటీ ఉందనుకుంటే.. ఇలా సీట్లు వదిలేస్తాం డబ్బులు ఇవ్వాంటూ టీడీపీ నేతలతో కొంత మంది బీజేపీ నేతలు బేరాలాడటం సంచలనంగా మారింది.
సీనియర్ల ఆవేదన పట్టదా ?
విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలు హాజరు కాలేదు. పార్టీని నమ్ముకున్న వారికి మేలు జరగడం లేదన్న అభిప్రాయంలో ఉన్నారు. సాధారణంగా పొత్తుల్లో పరిమితంగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు… పార్టీ సీనియర్ నేతలకు ప్రాధాన్యమిస్తారు. లేకపోతే క్యాడర్ లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. బీజేపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లభిస్తోంది. కొత్తగా వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఇలా ఎందుకు ఇస్తున్నారో పార్టీ నేతలకూ అర్థం కావడం లేదు.
లోతుగా పరిశీలిస్తే సంచలన విషయాలు
రూ. మూడు కోట్ల బేరం ఆడియో విషయంలో.. లోతుగా పరిశీలిస్తే.. సంచలన విషయాలు బయట పడతాయని అంచనాలు ఉన్నాయి. పొత్తుల్లో భాగంగా పార్టీకి లభించిన టిక్కెట్ల విషయంలో.. అనేక తెర వెనుక రాజకీయాలు.. అక్రమాలు చోటు చేసుకున్నాయన్న విమర్శలు బలంగా వస్తున్నాయి. బీజేపీ కోసం ప్రాణం పెట్టే సీనియర్లు అంతా మౌనం పాటిస్తున్నారు. వారికి ఏ విషయంలోనూ పార్టీ వ్యవహారాల్లో తగినంత ప్రాధాన్యం లభించడం లేదు. పార్టీ విజయం కోసం వారికి సరైన బాధ్యతలు ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గౌరవం కాపాడుకోవడానికి అయినా మౌనంగా ఉండటం ఉత్తమం అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీలో ఈ పరిస్థితిని సీనియర్లు లేఖ ద్వారా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు.