కేరళ సీఎం దుశ్చర్యలను తిప్పికొట్టిన బీజేపీ..

జాతీయతను కూడా తప్పుపట్టే నాయకుల్లో కేరళ సీఎం విజయన్ కూడా ఒకరు. బీజేపీని విమర్శించే నెపంతో ఆయన దేశ ప్రజల భావోద్రేకాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు. ప్రజ మనోభావాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. కొన్ని వర్గాలపై లేని మతవాదాన్ని అద్దేందుకు ఆయన ప్రయత్నిస్తుంటారు. బురదజల్లేందుకు ప్రయత్నిస్తే అది తిరిగి ఆయన మీదే పడినా విజయన్ కు బుద్ధి రావడం లేదు….

భారతమాతాకీ జై నినాదాన్ని వివాదం చేసే ప్రయత్నం

జాతీయ గీతాలాపన తర్వాత భారతమాతాకీ జై అని నినదించడం ఆనవాయితీగా వస్తోంది.విజయోత్సవ ర్యాలీల్లోనూ భారతమాతాకీ జై అనడం అలవాటైంది. ప్రతీ భారతీయుడి నోటి వెంట వచ్చే నినాదమే అది. అయితే ఆ నినాదం ఎలా వచ్చిందనేందుకు విజయన్ కొత్త భాష్యం చెప్పారు. అమానుల్లాఖాన్ అనే ముస్లిం దాన్ని కనిపెట్టి తొలి సారి వాడారని చెప్పుకొచ్చారు. ముస్లిం నేత తొలి సారి వాడిన నినాదాన్ని బీజేపీ వాళ్లు పదే పదే ఎలా చెబుతారని విజయన్ ప్రశ్నించారు. వాళ్లిప్పుడు ఆ నినాదాన్ని కొనసాగించాలా వద్దా అన్న సంగతి నిర్ణయించుకోవాల్సిన ఘడియ వచ్చిందన్నారు…

తొలుత వాడినదీ కిరణ్ చంద్ర బందోపాధ్యాయ

విజయన్ చెప్పినట్లుగా భారతమాతాకీ జై అన్న నినాదం తొలుత వాడినది అమానుల్లాఖాన్ మాత్రం కాదని తేలిపోయింది. దీనిపై బీజేపీ సుదీర్ఘ వివరణ ఇచ్చేందుకు వెనుకాడలేదు. 1873లో కిరణ్ చంద్ర బందోపాధ్యాయ రాసిన ఒక నాటకంలో ఈ మాటను వాడారు. అమానుల్లా ఖాన్ చెప్పినదీ మదర్ ఈ వతన్, భారత్ కీ జై అని మాత్రమే… తర్వాత వచ్చిన కిరణ్ చంద్ర బందోపాధ్యాయ.. భారతమాతాకీ జై అన్న నినాదాన్ని తొలుత ప్రచారంలోకి తెచ్చారు. 1882లో బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ రాసిన ఆనందమఠ్ నవలలో వందేమాతరం అనే మాట వాడకం కూడా భారతమాతాకీ జై అనే స్ఫూర్తి నుంచే వచ్చింది.

విద్వేషాలు సృష్టించొద్దని బీజేపీ హెచ్చరిక…

అమానుల్లా ఖాన్ ఎవరు అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమే. మరాఠా పాలకుడు నానా సాహెజ్ పేష్వా దగ్గర అమానుల్లా ఖాన్ మంత్రిగా పనిచేసేవారు. ఆయన రాజ్యాన్ని లాక్కుని బ్రిటన్ వాళ్లు సరిగ్గా పెన్షన్ కూడా ఇవ్వకపోవడంతో అమాన్లులా ఖాన్ బ్రిటన్ వెళ్లి అక్కడి కోర్టులో వాదించారు.బ్రిటిష్ పాలకులు దిగిరాకపోవడంతో 1857 నాటి తొలి స్వతంత్ర సంగ్రామంలో ఆయన పాల్గొన్నారు. అప్పుడే దేశ ప్రజలను ఆకట్టుకునేందుకు కొన్ని నినాదాలు ప్రచారంలోకి తెచ్చిన మాట వాస్తవమే అయినా… భారతమాతాకీ జై మాత్రం ఆయన కనిపెట్టినది కాదు. ఇప్పుడు బీజేపీ అదే మాట చెబుతూ విజయన్ దుశ్చర్యలను ఎండగడుతోంది. అది భారతీయులందరికీ పనికొచ్చే నినాదమని, హిందూ- ముస్లిం తేడా అందులో ఉండదని బీజేపీ నేత సుధాన్షు త్రివేది అన్నారు. ఈ ధరిత్రి మన తల్లి అని చెప్పుకోవడం రుగ్వేద కాలం నుంచి ఉందని దానికి మతము, రాజకీయ రంగు అద్దడం సహేతుకం కాదని బీజేపీ వాదిస్తోంది.