అన్నా-చెల్లెళ్లకి ఈ ఆలయంలోకి నో ఎంట్రీ!

సాధారణంగా ఏ గుడికైన కుటుంబ సమేతంగా వెళ్లి దర్శించుకుంటారు. అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటారు. కానీ ఓ ఆలయంలోకి మాత్రం అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు ఎంట్రీ లేదు. ఎక్కడుందా ఆలయం? ఇలాంటి నిబంధన ఏంటి?

చత్తీస్ గఢ్ లో శివాలయం
దేశంలో ఎన్నో హిందూ ఆలయాలున్నాయి. ప్రతి ఆలయం వెనుకా ఓ ప్రత్యేకత ఉంది. ఆ ఆలయానికో చరిత్ర ఉంటుంది. అయితే సోదర సోదరీమణులు వెళ్లకూడని ఆలయం ఉందంటే ఇది నిజంగా తెలుసుకోవాల్సిందే. చత్తీస్ గఢ్ నారాయణ పూర్ లో ఉన్న ఈ ఆలయంలోకి అన్నా చెల్లెళ్లను నిషేధించడం వెనుక ఓ కథ చెబుతారు స్థానికులు. బలోదాబజార్‌లోని కస్డోల్‌ సమీపంలో ఉన్న నారాయణపూర్‌ గ్రామంలో ఉన్న శివాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఏడు, ఎనిమిదో శతాబ్దకాలంలో కాలచూరి పాలకులు నిర్మించారు. ఆలయం ఎరుపు, నలుపు ఇసుకరాయితో నిర్మించారు. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు చెక్కారు. దేవాలయంలోనే చిన్న మ్యూజియం ఏర్పాటు చేసి తవ్వకాల్లో దొరికిన విగ్రహాలను అందులో భద్రపరిచారు.

అన్నాచెల్లెలు కలసి ఎందుకు వెళ్లకూడదు
అన్నా చెల్లెల్లు, అక్కాతమ్ముళ్లు కలిసి వెళ్లకుండా నిషేధించిన ఏకైక ఆలయం ఇదే. ఎందుకంటే ఈ ఆలయ నిర్మాణం రాత్రి సమయంలో జరిగేది. ఈ ఆలయాన్ని ఆరు నెలల్లోనే నిర్మించారు. ఈ ఆలయానికి గిరిజన ఆచారాలతో ముడిపడి ఉన్నది. శిల్పి నారాయణ్‌ రాత్రిపూట ప్రతిరోజూ నగ్నంగా ఆలయాన్ని నిర్మించేవాడట. ఆలయాన్ని నిర్మిస్తున్న నారాయణ్‌కు ప్రతి రోజూ ఆయన భార్య భోజనం తీసుకువచ్చేది. కానీ ఓ రోజు నారాయణ్‌ భార్యకు బదులుగా ఆయన సోదరి భోజనాన్ని తీసుకొచ్చింది. సోదరికి నగ్నంగా కనిపించడంతో మనస్తాపం చెందిన నారాయణ్ ఆలయ శిఖరం పైనుంచి దూకి ప్రాణం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఆలయంలోకి సోదర సోదరీమణుల ప్రవేశం నిషేధించారు. పైగా ఈ ఆలయంపై శృగారానికి సంబంధించిన శిల్పాలు చెక్కి ఉంటాయి…సోదరుడు, సోదరి కలసి వెళితే అసౌకర్యానికి గురవుతారనే ఉద్దేశంతో కూడా ఈ నిషేధం విధించారని చెబుతారు. అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లుకు ఇది వర్తించదు

గమనిక: పుస్తకాల నుంచి ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..