కోనసీమ జిల్లాల్లో నలుగురు సిట్టింగ్ ఎంఎల్ఎలను వైసీపీ పక్కన పెట్టింది. వారిని కాదని ఆయా స్థానాల్లో వేరొకరికి టిక్కెట్లను కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న సిట్టింగ్ ఎంఎల్ఎలు ప్రస్తుతం ముఖం చాటేస్తున్నారు. మొక్కు బడిగా కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నా ఎన్నికల ప్రచారంలో మాత్రం కనిపించడం లేదు. ఈ ప్రభావం వైసీపీ అభ్యర్థులపై కనిపిస్తోంది.
వైసీపీలోనే ఉన్నా ప్రచారానికి దూరం
జగ్గంపేటలో సిట్టింగ్ ఎంఎల్ఎ జ్యోతుల చంటిబాబుకు బదులు మాజీ మంత్రి తోట నరసింహంకు ఇక్కడ సీటుని కేటాయించారు. రెండు నెలల క్రితమే ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించడంతో అప్పటినుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న చంటిబాబు నియోజకవర్గంలో అంతగా కనిపించడం లేదు. కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభ కార్యక్రమాలు ఇటీవల జరగ్గా వాటికే పరిమితం అయ్యారు. అధికార పార్టీకి దాదాపుగా దూరంగానే ఉంటున్నారు. అధిష్టానం కూడా చంటిబాబుని పిలిపించి మాట్లాడలేదు. మరోవైపు తోట నరసింహం, అతని కుటుంబం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. చంటిబాబును కలుపుకుని వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఆయన కేడర్‌ను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో కొంతమంది టిడిపిలోకి చేరిపోయారు. ఇద్దరి ముఖ్య నేతల మధ్య తీవ్ర విభేదాలు ఉండడంతో వర్గాలుగా విడి పోయారు. సిట్టింగ్ ఎంఎల్ఎ పరోక్షంగా సమీప బంధువైన జ్యోతుల నెహ్రూకి మద్దతు పలుకుతున్నారని ప్రచారం జరుగుతుంది.
రగిలిపోతున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే
ప్రత్తిపాడు ఎంఎల్ఎ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ను పక్కనపెట్టి వరుపుల సుబ్బారావును వైసిపి బరిలో దింపింది. దీంతో పర్వత ప్రసాద్ ప్రస్తుతం ఎటువైపు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రచారాన్ని వరుపుల సుబ్బారావు ముమ్మరం చేశారు. చివర వరకు తనకే టికెట్ దక్కుతుందనే ఆశతో ఉన్నానని ప్రసాద్ ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. సుబ్బా రావు ఎన్నికల ప్రచారానికి ఎంఎల్ఎను కనీసంగానైనా పిలవడం లేదు. ఇక పిలిచే పరిస్థితి కూడా కనిపించ డం లేదు. ప్రసాద్ స్వగ్రామమైన శంఖవరం మండలంలో ఎంపిపి పర్వత బాపనమ్మ, రాజబాబు సహకారంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
పిఠాపురం ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడిన సీఎం జగన్
పిఠాపురం ఎంఎల్ఎ పెండెం దొరబాబు సైతం అసంతృప్తిలో కొనసాగుతున్నారు. టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆయన అనుచరులు కొంతమంది జనసేనలో చేరిపోయారు. ఎక్కువమంది కార్యకర్తలు బరిలో నిలిచిన కాకినాడ ఎంపీ వంగా గీతకు మద్దతు తెలుపుతూ ఆమె వెంటే ఉన్నారు. కేవలం కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలకే పరిమితమైన దొరబాబును ఇటీవల అధిష్టానం పిలిపించి మాట్లాడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిగా పోటీలో ఉండడంతో అన్ని శక్తులను అధిష్టానం ఏకం చేసే పనిలో భాగంగానే దొరబాబుని కూర్చోబెట్టి మాట్లాడింది. ఎన్నికల అనంతరం ఎంఎల్‌సి పదవి ఇచ్చేలా సీఎం జగన్ నుంచి హామీ వచ్చినట్లు ఎంఎల్ఎ చెపుతున్నారు. దాంతో ఆయన రెండు రోజుల నుంచి ఎంపీ వంగా గీతతో ప్రచారంలో పాల్గొంటున్నారు.
పి.గన్నవరంలో సిట్టింగ్ ఎంఎల్ఎ కొండేటి చిట్టిబాబు స్థానంలో జడ్పి చైర్మన్ వి.వేణుగోపాలరావుకి టికెట్ కేటాయించారు. కనీసం గానైనా ప్రచారానికి పిలవడం లేదు. ఆయనపై ఉన్న విమర్శలు కారణంగా ఓట్లు పడవని భావనలో వేణుగోపాలరావు ఉన్నారు. సంతృప్తితో ఉన్న చిట్టిబాబు కూడా వేణుగోపాలరావు వెంట తిరగడం లేదు. దీంతో చిట్టిబాబు వర్గం ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు.