ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది ? టిక్కెట్ల కసరత్తు దారి తప్పిందా ?

ఏపీ బీజేపీలో మెజార్టీ క్యాడర్ అసంతృప్తిగా కనిపిస్తోంది. పార్టీని నమ్ముకున్న వారికి మేలు జరగడం లేదన్న అభిప్రాయంలో ఉన్నారు. తాజాగా బద్వేలు ఉపఎన్నికల్లో పోటీ చేసి మంచి ఓట్లు తెచ్చుకున్న పనతల సురేష్ పెట్టిన సోషల్ మీడియా పోస్టు బీజేపీ వర్గాల్లో వైరల్ అయింది. దీంతో అసలేం జరిగిందన్న చర్చ బీజేపీలో ప్రారంభమయింది.

అసెంబ్లీ అభ్యర్థుల కసరత్తులో కొత్త నేతలకే ప్రాధాన్యం

సాధారణంగా పొత్తుల్లో పరిమితంగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు… పార్టీ సీనియర్ నేతలకు ప్రాధాన్యమిస్తారు. లేకపోతే క్యాడర్ లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. బీజేపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లభిస్తోంది. కొత్తగా వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఇలా ఎందుకు ఇస్తున్నారో పార్టీ నేతలకూ అర్థం కావడం లేదు. బయట వ్యక్తులే బలవంతులా… బీజేపీలో పని చేసిన వాళ్లు పనికి రాని వాళ్లా అన్న అసంతృప్తి కనిపిస్తోంది.

సీనియర్లు అంతా సైలెంట్ !

బీజేపీ కోసం ప్రాణం పెట్టే సీనియర్లు అంతా మౌనం పాటిస్తున్నారు. వారికి ఏ విషయంలోనూ పార్టీ వ్యవహారాల్లో తగినంత ప్రాధాన్యం లభించడం లేదు. పార్టీ విజయం కోసం వారికి సరైన బాధ్యతలు ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గౌరవం కాపాడుకోవడానికి అయినా మౌనంగా ఉండటం ఉత్తమం అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీలో ఈ పరిస్థితిని సీనియర్లు లేఖ ద్వారా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.

సిద్దాంత ఆత్మను కోల్పోతున్న ఏపీ బీజేపీ

రాజకీయ పార్టీకి సిద్దాంతం బలం. బీజేపీపునాదులు అవే. అయితే అనూహ్యంగా .. ఇప్పుడు బీజేపీ సిద్దాంతాలను వ్యతిరేకించిన వారే రాత్రికి రాత్రి అభ్యర్థులు అయిపోతున్నారు. ఇది పార్టీని బలహీనం చేస్తుందన్న ఆందోళన.. ఆ పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది. ఏం మాట్లాడినా పార్టీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఎక్కువ మంది పార్టీ అంతర్గత వేదికల మీదే తమ అభిప్రాయం చెబుతున్నారు.