ఎచ్చెర్ల సీటు బీజేపీకే – అభ్యర్థి అయనేనా ?

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుల నేపథ్యంలో ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు బీజేపీకే దక్కే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో విజయనగరం పార్లమెంట్‌ పరిధిలోని ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం మినహా మిగిలిన ఏడుచోట్ల అభ్య ర్థులను టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఎచ్చెర్ల పెండింగ్‌లో ఉండడంతో అందరిచూపు ఈ నియోజకవర్గంపై పడింది.

శ్రీకాకుళంకు బదులు ఎచ్చెర్ల

పొత్తులో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గాన్ని బీజేపీకి తొలుత ఇస్తామనుకున్నారు. కానీ తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తూ బీజేపీ నాయకుడు నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈయన ప్రస్తుతం విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఎచ్చెర్లలో పార్టీ బలోపేతం

పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా బంటుపల్లి, తిరుపతి పాలెం పంచాయతీల్లో బీజేపీ గెలుపు సాధించింది. నియోజకవర్గంలో 24,500 మంది బీజేపీకి కార్యకర్తలుగా సభ్యత్వం నమోదు చేసుకున్నారు. గత ఐదేళ్లలో భాజపా గణనీయమైన బలం పుంజుకుంది. ఆశించారు. 2014, 2019లో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే కళా వెంకటరావు కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ సొంత నియోజకవర్గం కావడంతో ఎచ్చెర్ల నుంచి టిక్కెట్‌ కోసం పట్టుబడుతున్నారు. కానీ బీజేపీకి ఇవ్వడంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు.

టీడీపీ నేతలు సహకరిస్తే బీజేపీ విజయం ఖాయం

ఎచ్చెర్లలో టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో సహకరిస్తే బీజేపీ విజయం ఖాయమన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే కళా వెంకట్రావు , కలిసెట్టి అప్పల్నాయుడు వర్గాల మధ్య వివాదాలున్నాయి. ఇద్దరికీ సీట్లు లభించకపోతే.. ఎవరికి వారు పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చలేకనే ఎచ్చెర్లసీటు బీజేపీకి ఇచ్చారన్న ఆరోపణలు రాకుండా అందర్నీ కలిసి పని చేసేలా చూడాల్సిన బాధ్యత టీడీపీపైనే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.