వాయినాడ్ బ్యాటిల్ లైన్స్ సిద్ధమయ్యాయి. రాహుల్ గాంధీని ఓడించాలన్న దృఢనిశ్చయంతో బీజేపీ పనిచేస్తోంది. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. గత ఎన్నికలు వేరు ఈ సారి గేమ్ ప్లాన్ వేరు అని బీజేపీ తేల్చేసింది. కేరళలోనూ రాహుల్ పై గెలుపు కష్టమేమీ కాదని బీజేపీ విశ్వసిస్తోంది…
రంగంలోకి కేరల బీజేపీ చీఫ్…
లోక్ సభ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన తాజా జాబితాలో వాయి నాడ్ అభ్యర్థి పేరు కూడా ఉంది. దీనితో ఏప్రిల్ 26న జరిగే పోలింగ్ కోసం కేరళలో మొత్తం 20 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయ్యింది. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే. సురేంద్రన్ ఈ సారి వాయినాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించింది. బీజేపీకి ప్రస్తుతం కేరళ నుంచి ఒక లోక్ సభ ఎంపీ కూడా లేరు. ఐనా పార్టీ ఈ మధ్యకాలంలో బాగా బలం పుంజుకుంది. తనపై విశ్వాసం ఉంచి, వాయినాడ్ టికెట్ కేటాయించిన మోదీ, అమిత్ షాలకు సురేంద్రన్ కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ విశ్వాసాన్ని వమ్ము చేయబోనని అంటూ తన మనసులో మాటను ఆయన బయటపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతానని ప్రకటించారు..
రాహుల్ పై పెరుగుతున్న వ్యతిరేకత…
నిజానికి వాయినాడ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా కొనసాగినా.. రాహుల్ గాంధీ నియోజకవర్గమైతే కాదు. 2019 ఎన్నికల్లో అమేఠీ నుంచి ఓడిపోతానని తెలిసిన రాహుల్ గాంధీ ముందు జాగ్రత్తగా వాయినాడ్ నుంచి కూడా నామినేషన్ వేశారు. అమేఠీలో ఓడిపోయి,వాయినాడ్ లో విజయం సాధించారు. కేరళ నియోజకవర్గంలో ఆయనకు 4.5 లక్షల మెజార్టీ వచ్చింది. పోలైన ఓట్లలో 68 శాతం ఆయనకే దక్కాయి. రాహుల్ వాయినాడ్ లో పోటీ చేయడం మిత్రపక్షాలైన లెఫ్ట్ పార్టీలకు ఏ మాత్రం నచ్చలేదు. వాళ్లు ఆయన తీరును వ్యతిరేకిస్తూ వచ్చారు. మోదీతో తలపడాలంటే ఉత్తరాదిన తేల్చుకోవాలని, దక్షిణాదికి వచ్చి సాధించేదేమిటని ప్రశ్నిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా వాయినాడ్ ను వదులుకునేదే లేదని ప్రకటిస్తూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా సతీమణి అన్నే రాజాను అక్కడ పోటీ చేయిస్తున్నారు. వాయినాడ్ లో రాహుల్ గాంధీ పట్ల వ్యతిరేకత పెరిగిపోవడం గమనించదగిన పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఉండదు. నియోజకవర్గ సంక్షేమానికి పనిచేయరు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరు. ఎవరనీ పట్టించుకోరు. అలాంటి వ్యక్తికి ఓ సారి ఓటేసి మోసపోయామని వాయినాడ్ జనం అంటున్నారు…
తేల్చని అమేఠీ, రాయ్ బరేలీ..
అమేఠీలో ఓడిపోయిన తర్వాత రాహుల్ అటువైపు పెద్దగా చూడలేదు. ఈ సారి రాయ్ బరేలీలో పోటీ చేయబోవడం లేదని సోనియా ప్రకటించారు. ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తారన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇన్ని జాబితాలు ప్రకటించినా ఇంతవరకు ఆ రెండు నియోజకవర్గాల జోలికి వెళ్లలేదు. దమ్ముంటే రాహుల్ మరోసారి అమేఠీలో పోటీ చేయాలని కేంద్ర మంత్రి ఆ నియోజకవర్గం ప్రతినిధి స్మృతీ ఇరానీ సవాలు చేస్తున్నారు. ఐనా రాహుల్ వైపు నుంచి ఇంకా సమాధానం రాలేదు…..