తూ.గో జిల్లాలో బీజేపీ సీట్లపై అస్పష్టత – అభ్యర్థుల ఖరారు ఆలస్యం

తూ.గో జిల్లాలో పార్లమెంటు స్థానంతో పాటు ఒక అసెంబ్లీ స్థానం బిజెపికి దక్కనుంది. సోము వీర్రాజు కోసం రాజమండ్రి అర్బన్ ఇస్తారనుకున్నా.. అక్కడ చంద్రబాబు టిక్కెట్ వేరే వారికి ప్రకటించారు. ఇప్పుడు ఆనపర్తి ఇస్తామని అంటున్నట్లుగా తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో టిడిపి నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 1373 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2019లో వైసిపి అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి 55,207 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గడిచిన రెండుసార్లు ఇద్దరు అభ్యర్థులూ పోటాపోటీగా తలపడ్డారు. తాజాగా అధికార వైసిపి సత్తి సూర్యనారాయణ రెడ్డికి సీటు ఖరారు చేసింది.

ఆనపర్తి అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ

టిడిపి అనపర్తి నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎంఎల్‌ఎం నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి తొలి జాబితాలోనే స్థానం లభించింది. అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత టిడిపి అభ్యర్థికి కలిసివస్తుందని కార్యకర్తలు భావించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ సీటు బిజెపికి కేటాయిస్తారనే ప్రచారం ఊపందుకుంది. టిడిపి, జనసేన కూటమి తొలిజాబితా ప్రకటించే నాటికి బిజెపితో పొత్తుపై స్పష్టత లేకపోవటమే దీనికి కారణమని తెలుస్తోంది. బిజెపినేతలు తొలుత రాజమహేంద్రవరం స్థానం కోరినట్లు సమాచారం. ఈ స్థానం అప్పటికే ఆదిరెడ్డి వాసుకు కేటాయిస్తూ అధినేత నిర్ణయించారు. రాజానగరం అయినా పర్వాలేదనుకున్నారు. కానీ జనసేనకు కేటాయించారు. ఇప్పుడు ఆనపర్తి తీసుకోమంటున్నారు.

రాజమండ్రి ఎంపీ స్థానం పైనా స్పష్టత ఉందా ?

రాజమహేంద్రదవరం ఎంపీ స్థానంపైనా సందిగ్ధత నెలకొంది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి తాజాగా మూడో జాబితా విడుదల చేసMejg. జాబితాలో అమలాపురం నుంచి టిడిపి అభ్యర్థిగా బాలయోగి తనయుడు హరీష్‌ బరిలో నిలిచారు. జనసేన పార్టీ నుంచి టీ టైం అధినేతగా సుపరిచితులైన తంగెళ్ల ఉదరు కుమార్‌ కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు కూటమి స్పష్టం చేసింది. రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పురందేశ్వరి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఒంగోలు నుంచి పురందేశ్వరి

పురందేశ్వరి ఒంగోలు పార్లమెంటు స్థానం కోరుతున్నట్లు సమాచారం. ఈ కారణంగా అభ్యర్థి ప్రకటన ఆలస్యమైందని తెలుస్తోంది. అధికార పార్టీ వైసిపి ఇప్పటికే ఎంపి అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్‌ను ప్రకటించారు. టీడీపీ నుంచి ఇచ్చే సీట్లలో స్పష్టత లేకపోవడంతో… అభ్యర్థుల ఖరారు బీజేపీలో ఆలస్యమవుతోంది.