బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బీజేపీ తరపున పోటీ చేయడానికి ఆయన అనకాపల్లిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇలా వరుసగా వివాదాలు రావడంతో .. టిక్కెట్ దక్కడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
సీఎం రమేష్ పై కేసు పెట్టిన వ్యాపార భాగస్వామి
సీఎం రమేష్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. పిసిఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించిన పత్రాలపై సంతకాలు ఫోర్జరీ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. వందల కోట్ల రూపాయల పత్రాలు కావడంతో పోలీసులు కేసును హైదరాబాద్ సిసిఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో స్టేట్మెంట్ కోసం కావూరి భాస్కర్‌రావు సిసిఎస్ పోలీసుల ఎదుట శనివారం హాజరయ్యారు. అరగంట పాటు తన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారని, కంపెనీకి సంబంధించిన సంతకాలు ఫోర్జరీ చేసి సిఎం రమేష్ రూ.450 కోట్లు కొట్టేశాడని కావూరి ఆరోపించారు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని తెలిపారు. సిబిఐ విచారణ చేస్తే సిఎం రమేష్ వేల కోట్ల స్కాంలు బయటకు వస్తాయని తెలిపారు.
బీజేపీకి తప్ప ఇతర పార్టీలకు విరాళాలు
మరో వైపు సీఎం రమేష్ .. కాంగ్రెస్, జేడీఎస్ కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చినట్లుగా బయటపడింది. ఆయన బీజేపీకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీనిపై బీజేపీ హైకమాండ్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్లుగా చెబుతున్నారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొనిచ్చారు . వాటిని కాంగ్రెస్ ఎన్ క్యాష్ చేసుకుంది. అలాగే మరో కర్ణాటక పార్టీ అయిన జేడీఎస్ కు కూడా పది కోట్ల రూపాయలన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీ ఆయన మాతృపార్టీ. ఆ పార్టీకి కూడా ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఓ కాంట్రాక్ట్ వచ్చినందుకు ఆయన ఈ విరాళాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
టిక్కెట్ పై ప్రభావం
ఎన్నికల్లో పోటీకి ఆయనకు అవకాశం కల్పించకూడదన్న వాదన బీజేపీలో వినిపిస్తోంది. ఆయన బీజేపీపై ఇష్టంతో పార్టీలో చేరలేదని వ్యాపారాలు, ఆర్థిక ప్రయోజనల కోసమే చేరారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన అనకాపల్లి నుంచి ఎన్నికల బరిలో నిలవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ బాండ్ల వివరాలు బయటకు రావడంతో ఆయన కు టిక్కెట్ ఇవ్వడంపై పార్టీ హైకమాండ్ పునరాలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.