పాడేరు, అరకు సీట్లు బీజేపీకేనా ? – అభ్యర్థులపై రాని స్పష్టత

అల్లూరి జిల్లాలోని అరకు పార్లమెంట్‌, పాడేరు అసెంబ్లీ స్థానాలకు టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ వీడటం లేదు. రోజురోజుకూ ఇక్కడ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అరకు పార్లమెంట్‌ స్థానానికి బిజెపి అభ్యర్థిగా మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పేరు ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటివరకు గీత పేరును ఖరారు చేస్తూ అదికారికంగా ప్రకటించలేదు. మరోవైపు పాడేరు అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న గిడ్డి ఈశ్వరి పేరు ఇప్పటికీ ప్రకటించలేదు.

టీడీపీ మూడో జాబితాలోనూ లేని పాడేరు అసెంబ్లీ అభ్యర్థి పేరు

పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ఈ సీటు ఖరారు అవుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా నియోజవర్గంలోని టిడిపి నాయకులు కొట్టగుల్లి సుబ్బారావు, కిల్లు రమేష్‌ నాయుడు, ఎంవివి ప్రసాద్‌ ఈ ముగ్గురు పాడేరు టిడిపి టికెట్‌ తమకే దక్కుతుందని ఆశాభావంతో ఇప్పటికే నియోజవర్గంలో జోరుగా ప్రచార పర్వం మొదలు పెట్టారు. గత నెల రోజులుగా వీరు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు పాడేరు అసెంబ్లీ సీటును బిజెపికి కేటాయిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అరుకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కూటమిలోని బిజెపికి దక్కలేదు. దీంతో పాడేరు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని బిజెపి పార్టీ శ్రేణులు పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది.

పాడేరులో బలహీనపడ్డ టీడీపీ

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం కాస్త బలహీనపడింది. 1999 ఎన్నికల తర్వాత నుంచి టిడిపి ఈ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా గెలవలేక పోయింది. ఈసారి సానుకూల పరిస్థితులు ఉన్నాయని పాడేరు సీటు కోసం ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన వికసిత్‌ భారత్‌ కార్యక్రమానికి కూడా ఆదివాసి లో మంచి స్పందన కనిపించింది. గిరిజనులకు ఎంతో ప్రయోజనంగా ఉన్న అటవీ చట్టాల సవరణ జీవో 3 రిజర్వేషన్‌ రద్దు చేస్తామన్నహమీని కూటమి ఇస్తోంది. దీంతో కూటమి అభ్యర్థికి ఆదరణ లభిస్తోంది.

అభ్యర్థులపై బీజేపీ కసరత్తు

సీట్ల విషయంలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని అదిష్టానాన్ని బీజేపీ నేతలు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ ప్రతికూల పరిస్థితుల కారణంగా అభ్యర్థుల ఎంపిక తో పాటు పొత్తులతో సీట్లు కేటాయింపులో కూడా ఎదురవుతున్న చిక్కులపై కూటమి నేతలు కొత్త వ్యూహ రచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధుల్ని ప్రకటించడంతో అరుకు పార్లమెంట్‌, పాడేరు అసెంబ్లీ స్థానాలకు కూటమి నేతలు కొత్త వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ముఖాలను బరిలోకి తెచ్చి ఈ స్థానాల్లో ప్రస్తుతం నెలకొన్న అసమ్మతి అసంతృప్తి వ్యతిరేక పరిస్థితులను చక్కబెట్టాలని కూటమి నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.