శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎంపికపై మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం ప్రకటించిన కూటమి అభ్యర్థి సమర్ధత, విశ్వసనీయతపై ప్రజల్లో, పార్టీ కేడర్లో తీవ్ర వ్యతిరేకత, అనుమానాలున్నాయని విమర్శలు చేశారు. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఓ సారి ఎమ్మెల్యేగా తనను తాను నిరూపించుకున్నాననీ, తన సమర్ధత, విశ్వసనీయతను నమ్మి వయస్సు రీత్యా తనకే అవకాశం కల్పించాలంటూ ఎస్సీవీ నాయుడు తెర మీదకు వచ్చారు.
బొజ్జల సుధీర్ రెడ్డికి మద్దతు లేదు !
మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇటీవల టీడీపీలో చేరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ టిక్కెట్టుపై మొదటి నుంచి తాను ఆశలు పెట్టుకున్నట్లు తెలిపారు. 2019లో జరిగిన తప్పును పునరావతం కానివ్వనని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు చెప్పారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డ తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డికి అధిష్టానం టిక్కెట్టు కేటాయించడం బాధ కలిగించిందన్నారు. అయితే టిక్కెట్టు ప్రకటన అనంతరం తాను భవిష్యత్ కార్యాచరణపై శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తలతో సమావేశమైనప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి తనను కలిసి మద్దతు కోరారని చెప్పారు. ఆయన అభ్యర్థన మేరకు మీడియా ముందుకు వచ్చి అదేవిధంగా చెప్పాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
మహిళలను అవమానిస్తున్న సుధీర్ రెడ్డి
తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఒడంబడిక జరగలేదని వివరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కబ్జాలు, రౌడీయిజం పేట్రేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు సొంత పార్టీలో అవమానాలే జరుగుతున్నాయని వినుత, చక్రాల ఉష, ముని రాజమ్మ ఉదంతాలను ఉదహరించారు. నేటి శ్రీకాళహస్తి రాజకీయాన్ని తలుచుకుంటే భయం వేస్తోందనీ, భవిష్యత్తుపై బెంగ పుడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కారణంగా కూటమి అభ్యర్థుల విషయంలో శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందనీ, చంద్రబాబు పున్ణ పరిశీలించాలని సూచించారు. వయసు రీత్యా తనకు ఎమ్మెల్యేగా చివరి అవకాశం కల్పించాలనీ, తదనంతరం తాను రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకోనున్నట్లు ప్రకటించారు.
చంద్రబాబును కలవనున్న ఎస్సీవీ నాయుడు
తన అభ్యర్థిత్వంపై అనుచరవర్గంతో కలిసి త్వరలో చంద్రబాబును కలవనున్నాననీ, అనంతరం తన తుది నిర్ణయాన్ని మీడియా ముఖంగా వెల్లడిస్తానని స్పష్టం చేశారు. , అధినేత నారా చంద్రబాబునాయుడు పునరాలోచించి, అభ్యర్థుల మార్పు చేయాలని పట్టుబడుతున్నారు. లేదంటే…స్వతంత్రంగా బరిలో దిగినా ఆశ్చర్యపోనక్కరలేదనన అభిప్రాయం వినిపిస్తోంది.