తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వద్దని ఆయనకు టికెట్ ఇస్తే తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోవడం తధ్యమని, స్థానిక అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తిరుపతి ఎమ్మెల్యే సీటు గెలుచుకుంటామని తిరుపతి టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ బాహాటంగా తన అసంతప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం ప్రైవేట్ హోటల్లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుపతి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అభ్యర్థి ప్రకటించిన వారం రోజుల తర్వాత సుగుణమ్మ కార్యకర్తలు నాయకులతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు.
జనసేనలో చేరుతా తనకే టిక్కెట్ కావాలంటున్న సుగుణమ్మ
తిరుపతి ఎమ్మెల్యే టికెట్‌ను సుగుణమ్మ ఆశించారు. పొత్తులో భాగంగా టిడిపి అధిష్టానం జనసేనకు అసెంబ్లీ సీటు కేటాయించింది. సుగుణమ్మ ఎమ్మెల్యే టికెట్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో లోకల్.. నాన్ లోకల్ గొడవలు తిరుపతిలో మొదలయ్యాయి. చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులుకి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా టికెట్ ఇస్తారని, ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు ఎలా సద్ది చెప్పాలని వారు ప్రశ్నించారు. ఆరనికి టికెట్ ఇవ్వవద్దని, స్థానికులకే ఇవ్వాలని కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును కలిసి నచ్చచెబుతామని అన్నారు. వారు విని అభ్యర్థిని మార్చి స్థానికులకు ఇస్తే అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించుకుంటామని, లేదని ఆరణి శ్రీనివాసులుకే టికెట్ ఇస్తే ఆయన ఓడిపోవడం తథ్యమని అంటున్నారు. నిజానికి సుగుణమ్మ జనసేనలో అయినా చేరుతా .. తనకే టిక్కెట్ కావాలని అడుగుతున్నారు.
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణికి టిక్కెట్ ఖరారు చేసిన ప వన
తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ప్రచారం మొదలుపెట్టి ఇంటింటికీ తిరగుతున్నారు. జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు స్థానికుడు కాదంటూ జనసేన చెందిన ఓ వర్గం కిరణ్ రాయల్, రాజారెడ్డి సంబంధించిన వర్గీయులు ఆరణి శ్రీనివాసులు ఇంతవరకు కలవలేదు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అని ప్రచారం చేపట్టినప్పటికీ ఈ వర్గం దూరంగానే ఉంటున్నారు. జనసేన పార్టీకి చెందిన డాక్టర్ హరిప్రసాద్ మాత్రమే ఆరణి శ్రీనివాసులతో ప్రచారంలో పాల్గొంటున్నారు మిగతావారు కూడా కలవడం లేదు. జనసేన పార్టీ పరిశీలకులు వచ్చి నచ్చచెప్పినా కిరణ్ రాయల్ ససేమిరా అన్నట్టు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ విషయం పవన్ కళ్యాణ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కిరణ్ రాయల్ పార్టీ పరిశీలకు చెప్పినట్టు సమాచారం.
నరసింహ యాదవ్ అలిగారా…?
తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పేరు ప్రకటించినప్పటి నుంచి టిడిపి తిరుపతి పార్లమెంటు ఇన్‌ఛార్జి నరసింహ యాదవ్ పార్టీ కార్యక్రమాలకు గత పదిరోజుల నుంచి దూరంగా ఉంటున్నారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఇంతవరకు కలవకపోవడం, తిరుపతి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసింహ యాదవ్ కూడా ఆఖరి వరకు ప్రయత్నాలు చేసి విఫలమైనారు. పొత్తులో భాగంగా తిరుపతి సీటు జనసేన ఇవ్వడం పట్ల టిడిపి నేతలు క్యాడర్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. నరసింహ యాదవ్ పార్టీ తీరు పట్ల అలిగారా లేదా పార్టీకి దూరంగా ఉంటున్నారా తెలియాల్సి ఉంది.