ఏపీ బీజేపీ .. పొత్తులో భాగంగా తమకు వచ్చే సీట్లలో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తమకు గట్టి పట్టు ఉన్న, గతంలో గెలిచిన నియోజకవర్గాలను మాత్రమే ఎంచుకోవాలని అనుకుంటోంది. స్వయంగా హైకమాండ్ జోక్యం చేసుకోవడంతో పార్టీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. హైకమాండ్ కు అందిన నివేదిక ఆధారంగా సీట్లు, అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.
టీడీపీ ఇవ్వజూపిన సీట్లపై అభ్యంతరం
పొత్తుల్లో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. అయితే స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు. పాడేరు, అనపర్తి, ఆదోనీ వంటి సీట్లపై స్పష్టత రాలేదు. బీజేపీ నేతలు ఆశిస్తున్న గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంతో సమస్య జఠిలంగా మారింది. చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించినా మార్పులు తప్పవనే అంచనాలు వినిపిస్తున్నాయి.
రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల ప్రకటన
బీజేపీకి పెద్దగా సంస్థాగత బలం లేని చోట్ల సీట్లు కేటాయించారన్న విమర్శలు ఉన్నాయి. ఎంపీ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినా.. పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ సీనియర్లకు సంతృప్తి లభించడం లేదు. తీసుకుంటున్నదే తక్కువ సీట్లు కాబట్టి.. ఖచ్చితంగా గెలిచే సీట్లు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి సరైన క్యాడర్ లేకపోయినా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు హైకమాండ్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. స్వయంగా నియోజకవర్గాలు, అభ్యర్థులపై కసరత్తు చేసి రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉంది.
గతంలో గెలిచిన నియోజకవర్గాలే ఎక్కువగా తీసుకునే చాన్స్
గతంలో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేసి గెలిచిన నియోజకవర్గాలే ఎక్కువగా తీసుకోవాలన్న వాదన వినిపిస్తోంది. హైకమాండ్ కూడా అదే భావనతో ఉంది. గతంలో పిఠాపురం, కదిరి, విజయవాడ వెస్ట్ వంటి వాటిలో విజయం సాధిచింది. అవన్నీ ఇప్పుడు బీజేపీ ఖాతాలో వేస్తే వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించవచ్చని అనుకుంటున్నారు.