ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ భారీ మెజార్టీ సాధించే లక్ష్యంతో లోక్ సభ ఎన్నికల దిశగా దూసుకుపోతోంది. 400 పార్ అన్న తమ ఆలోచన సఫలం కావాలంటే ఉత్తర ప్రదేశ్లో అత్యధిక సీట్లు సాధిస్తే సరిపోదని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించాలని ఆ పార్టీ అగ్రనేతలు అంచనా వేసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సీట్లు సాధించాల్సిన అనివార్యతను మోదీ సహా అందరు నేతలు గుర్తించారు. అందుకే దక్షిణ రాష్ట్రాల ప్రజలను బీజేపీ వైపు తిప్పుకునేందుకు మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రతీ రాష్ట్రంలోనూ పర్యటిస్తున్నారు…
ఏడాది ప్రారంభం నుంచి ఇటే దృష్టి…
2024ను ఎన్నికల సంవత్సరంగా పరిగణిస్తూ మోదీ వరుస టూర్లు చేస్తున్నారు. ఇంతవరకు తమిళనాడులో ఆయన ఏడు సార్లు పర్యటించారు. తెలంగాణలో నాలుగు పర్యాయాలు, కేరళలోనూ నాలుగు సార్లు ఆయన పర్యటించారు. కర్ణాటకకు మూడు సార్లు వెళ్లిన మోదీ, ఏపీకి రెండు పర్యాయాలు వచ్చారు. మార్చి 15 తర్వాత ఆయన పర్యటిస్తున్న ప్రదేశాలను పరిశీలిస్తే… ఖచితంగా పార్టీ గెలిచే చోటికే ఆయన వస్తున్నట్లు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండదు…
మోదీ టార్గెట్ 50 ప్లస్
ప్రధాని మోదీ ఐదు రోజుల పాటు నిరాటంకంగా దక్షిణాదిలో తిరిగారు. ఆయన ఢిల్లీ వెళ్లే నాటికి ఈ ఏడాది దక్షిణాదిన 20 సభల్లో ప్రసంగించినట్లయ్యింది. ఎన్నికలు పూర్తయ్యే సరికి కనిష్టంగా 50 సార్లు దక్షిణాదికి వచ్చి వెళ్లాలని, అంతకంటే ఎంత ఎక్కువగా రాగలిగితే అంత మంచిదని పార్టీ వ్యూహకర్తలు అంటున్నారు. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీయేకు 60 స్థానాలైనా దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది.గత వారం ప్రస్తారమైన మెగా ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ సారి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీయేకు 58 స్థానాలు రావచ్చు. ఏపీలో 18, తెలంగాణలో 8, కర్ణాటకలో 25, తమిళనాడులో 5, కేరళలో రెండు స్థానాలు రావడం ఖాయమనిపిస్తోంది.
చేయి కలిపిన కొత్త మిత్రులు…
బీజేపీకి ఇప్పుడు అన్ని అంశాలు కలిసొస్తున్నాయి. కొత్త మిత్రులు వచ్చి ఎన్డీయేలో చేరుతున్నారు. కొందరు పాత మిత్రులు మళ్లీ వచ్చి జై మోదీ అంటున్నారు. ఏపీలో జనసేన ఇప్పటికే ఎన్డీయే కూటమిలో ఉండగా, ఇప్పుడు టీడీపీ వచ్చి చేరడంతో తిరుగులేని శక్తిగా అవతరించింది. కర్ణాటకలో జేడీఎస్ వచ్చి చేతులు కలపడంతో పాటు బీజేపీ ఇచ్చినన్ని సీట్లు తీసుకునేందుకు ఒప్పుకుంది. తమిళనాడులో పీఎంకే ఇప్పుడు ఎన్డీయే భాగస్వామిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై తన పదవికి రాజీనామా చేసి తమిళనాడులోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అది బీజేపీకి కలిసొచ్చే పరిణామమని చెప్పాలి. తెలంగాణ గవర్నర్ గా ఆమె అత్యంత పాపులర్ నాయకురాలయ్యారు. ఆమెను నిలబెట్టేందుకే మోదీ తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించారని కూడా వార్తలు ఉన్నాయి. చూడాలి మరి..