ఈశ్వరుడిని కొలువుతీర్చిన రాముడు – మోక్షాన్నిచ్చే క్షేత్రం ఇది!

శ్రీరామచంద్రుడు 14 ఏళ్లు వనవాసం చేసినసమయంలో ఆయన నడయాడిన ప్రదేశాలన్నీ ప్రత్యేకమైనవే. అలాంటి క్షేత్రాల్లో అత్యంత విశిష్టమైనది రామేశ్వరం. శ్రీరాముజు ఏ కార్యం తలపెట్టినా శివుడిని ఆరాధించేవాడు. శివారాధన తర్వాత ఏ కార్యం తలపెట్టినా విజయం తథ్యం అని నిరూపించి చూపించాడు. శాస్త్రాల ప్రకారం, శ్రీరాముని ఆరాధించేవాడు శివుడు. శివుని ఆరాధించేవాడు శ్రీరాముడు.రాముడు ఏదైనా పని చేసే ముందు శివుని పూజించేవాడు. స్వయంగా శ్రీరాముడు శివలింగం ఏర్పాటు చేసి పూజించిన ప్రదేశమే రామేశ్వరం.

రావణ వధ పాపాన్ని పోగొట్టుకునేందుకు
రావణాసురుడిని వధించిన తర్వాత రాముడు పాపాన్ని పోగొట్టుకునేందుకు రామనాథపురంలోని సముద్ర తీరంలో మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజించాడు. ఆ ప్రాంతమే రామేశ్వరంగా బాసిల్లుతోంది. 15వ శతాబ్దం మొదట్లో పాండ్యులు ఏలిన ఈ ప్రాంతం ఆ తర్వాత సేతుపతిరాజుల పాలనలోకి వచ్చింది. ఆ తర్వాత భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయులు దీనిని రామనాడు అని పిలవడం ప్రారంభించారు. 690 అడుగుల పొడవు, 435 అడుగుల వెడల్పు, 1212 స్తంభాలతో కూడిన ప్రకారంతో ఈ ఆలయం ప్రసిద్ధి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ ఆలయంలో శివలింగం ఒకటి. ఉత్తర భారతదేశంలో ఉన్న కాశీలోని గంగానదిలో పుణ్యస్నానం ఆచరించి విశ్వనాథుడిని ప్రార్థిస్తే ముక్తి లభిస్తుందని అంటారు. ఆ విధంగానే దక్షిణ భారతదేశంలో ఉన్న రామేశ్వరంలోని అగ్ని తీర్థం, ఆలయంలో ఉన్న 22 తీర్థాల్లో స్నానం ఆచరించి రామనాథస్వామిని ఆరాధిస్తే మోక్షం దక్కుతుందని ప్రతీతి.

రామేశ్వరం ఆలయ విశేషాలివే
తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లాకు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం ఇది. ఈ ఆలయ గర్భగుడిలో శివుని 11వ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్టించారు. రాముడు లంకను జయించాలనుకునే ముందు ఈ ప్రదేశంలో తన ఆరాధ్య దైవమైన శివుడిని పూజించాడు. ఈ ప్రదేశంలో మహాదేవుని శివలింగాన్ని స్థాపించి పూజించాడు. రాముడి పేరు మీదుగా ఈ ప్రాంతానికి రామేశ్వరం అని పేరు వచ్చింది. త్రేతాయుగం తర్వాత రామేశ్వరం ఆలయాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించారు. ఈ ఆలయాన్ని ఆదిత్యవర్మన్ I, రాజేంద్ర చోళ I, రాజరాజ చోళ I, కృష్ణదేవరాయలు వంటి అనేక మంది రాజులు కొత్తగా నిర్మించారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకునే అత్యంత పుణ్యఫలం అని భక్తుల విశ్వాసం.

కోదండరామస్వామి ఆలయం
రామేశ్వరంలో ఉన్న కోదండరామస్వామి ఆలయం ముఖ్యమైన పుణ్యస్థలం. రామేశ్వరం నుంచి ధనుష్కోటికి వెళ్లే మార్గంలో ఉన్న చిన్న దీవిలో ఈ ఆలయం ఉంది. 1964లో ధనుష్కోటిలో ఏర్పడిన ప్రళయం నుంచి బయటపడిన ఒకేఒక చారిత్రక నిర్మాణం ఇదే. ఈ ఆలయంలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమాన్‌, విభీషణుడు కొలువుదీరి ఉన్నారు. రాముడు విల్లుతో ఉండటంతో కోదండరాముడిగా పేరు. విభీషణుడు రాముడు, ఆయన వానర సైన్యాన్ని ఆశ్రయించిన ప్రాంతంగా దీనిని భావిస్తారు.

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..