పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో ఈ నియోజకవర్గంపై చర్చ జరుగుతోంది. అక్కడ గత ఎన్నికల్లో వచ్చిన తీర్పులపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సెంటిమెంట్ ప్రకారం జనసేనదే విజయమని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. పవన్ కల్యాణ్ విజయ సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు.
భిన్నమైన తీర్పులు ఇచ్చే పిఠాపురం ఓటర్లు
పిఠాపురం నియోజకవర్గం 1952లో ఏర్పడింది. తొలుత సీపీఐ అభ్యర్థి ఆర్వీ జగ్గారావు ఎమ్మెల్యేగా గెలిచారు. 1955లో వాడ్రేవు గోపాలకృష్ణ, 1960 ఉపఎన్నికలో పేకేటి తమ్మిరాజు ప్రజాపార్టీ తరఫున విజయం సాధించారు.1962 నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా నడిచింది. వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1962లో రావు భావన్న, 1967, 1972లో యాళ్ల సూర్యనారాయణమూర్తి , 1978, 89లో కొప్పన వెంకట చంద్రమోహనరావు హస్తం పార్టీ తరఫున గెలిచారు. కాంగ్రెస్ ఇక్కడ 1989లో చివరిసారిగా గెలిచింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా నడిచిన 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ నుంచి గెలవలేకపోయింది. టీడీపీ ఏర్పడిన తర్వాత 1983, 85, 94 ఎన్నికల్లో వెన్నా నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచారు. టీడీపీ ఇక్కడ చివరి సారిగా 1994లోనే గెలిచింది. ఏపీ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ పసుపు పార్టీ విజయం సాధించలేదు.
పొత్తుల్లో ఓ సారి బీజేపీ అభ్యర్థి గెలుపు
1999 నుంచి పిఠాపురం ఓటర్లు విలక్షణ తీర్పులు ఇస్తున్నారు. 1999లో స్వతంత్ర అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావు సంచలన విజయం సాధించారు. 2004లో బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబు అనూహ్యంగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగా గీత విజయభేరి మోగించారు. 2014లో స్వతంత్ర అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మకు ఓటర్లు భారీ మెజార్టీతో విజయాన్ని కట్టబెట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు విజయం సాధించారు. 1985 తర్వాత ఏ పార్టీ ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలవలేదు. చివరిసారి టీడీపీ 1983, 85 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. అలాగే 1989 నుంచి గెలిచిన పార్టీ ఇప్పటి వరకు మళ్లీ తిరిగి విజయం సాధించలేదు. ప్రతి ఎన్నికల్లో కొత్త పార్టీని ఆదరిస్తున్నారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థులను గెలిపిస్తున్నారు.
కాపు ఓట్లపైనే పవన్ కల్యాణఅ ఆశలు
ఇక్కడ కాపు ఓట్లు యాభై శాతం వరకూ ఉండటమే పవన్ ను ఆకర్షించిందని అనుకోవచ్చు. 1989లో విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు మళ్లీ అక్కడ గెలవలేకపోయింది. అలాగే టీడీపీ 1994 తర్వాత మళ్లీ విజయం సాధించలేదు. 2004 గెలిచిన బీజేపీ మళ్లీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోలేదు. 2009 ప్రజారాజ్యం, 2019లో వైసీపీ గెలిచాయి. మరి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? ఈసారి కొత్త పార్టీకి పట్టం కడతారా? ఆనవాయితీ ప్రకారం ఈసారి జనసేనను ప్రజలు ఆదరిస్తారా? పవన్ కల్యాణ్ ను గెలిపిస్తారా? జనసేనాని విజయం నల్లేరుపై నడకేనా? ఇప్పుడు ఇదే చర్చ ఏపీలో జరుగుతోంది.