ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గుజరాత్ వాసే. ఇద్దరు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగానూ మంచి స్నేహితులు. ఆ ఇద్దరి కాంబినేషన్లో పదేళ్లుగా దేశ ప్రగతి పరుగులు తీస్తోంది. ఇప్పుడు మోదీ 3.0 దిశగా బీజేపీ వెళ్తున్న వేళ..ఎన్నికల్లో ప్రతి రాష్ట్రం ముఖ్యమేనన్న ఆలోచన కలుగుతోంది. అందులోనూ గుజరాత్ తమకు ఆయువు పట్టుగా ఉండాలని బీజేపీ ఎదురుచూస్తోంది…
క్లీన్ స్విప్ వారి లక్ష్యం..
హోం మంత్రి అమిత్ షా తాజాగా గుజరాత్ వచ్చారు. అహ్మదాబాద్ లో హనుమాన్ టెంపుల్ ను దర్శించుకున్న తర్వాత పార్టీ నేతలతో లోక్ సభ ఎన్నికల వ్యూహాన్ని చర్చించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో పాటు ఇతర నేతలకు దిశానిర్దేశం చేశారు. గుజరాత్లో మొత్తం 26 లోక్ సభా స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించింది. ఈ సారి కూడా మిషన్ 26 అంటే మొత్తం 26 సీట్లతో జయకేతనం ఎగురవేయాలని ఆయన హితబోధ చేశారు. ఆ దిశగా ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేయాలని కూడా సూచించారు.
పోల్ స్ట్రాటజీ మారాలి…
గతంలో జరిగిన ఎన్నికల వేరు.. ఈసారి జరుగుతున్న ఎన్నికలు వేరని అమిత్ షా గుర్తుకు తెచ్చారు. ఇప్పుడు ప్రతీ పార్టీ ప్రాధమ్యాలు మారయిని, పైగా 400 పార్ అంటే 400 స్థానాల్లో గెలవాలి అని మోదీ అంటున్నారని షా గుర్తుచేశారు. ఆ దిశగా నేతలు దృష్టి పెడుతూ పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలన్నారు. మనుపటి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తేనే పార్టీలో ప్రగతి సాధ్యమని ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తూ, కేంద్ర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు అమోఘమైన ఫలితాలను చూపినందునే గుజరాత్ ప్రజలు బీజేపీకి మద్దతిస్తున్నారని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, చొరబాట్లు, చైనా దుశ్చర్యలను అడ్డుకోగల ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. భారత్ త్వరలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని ఆయన ప్రకటించారు..
గాంధీ నగర్ లో పది లక్షల మెజార్టీ ?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గాంధీ నగర్ లోక్ సభా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు ఐదు లక్షలకు పైగా మెజర్టీ వచ్చింది. ఈ సారి కనీసం పది లక్షల మెజార్టీ చూపించి అమిత్ షాను,మోదీని సంతోష పెడతామని గుజరాత్ బీజేపీ నేతలు చెబుతున్నారు. గాంధీనగర్ నియోజకవర్గం దేశంలోని రికార్డుగా ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారు. గాంధీనగర్ లోనే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ దాదాపు రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. అమిత్ షా ఎమ్మెల్యేగా పోటీ చేసి సరిగ్గా 30 ఏళ్లు అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడాయన ఒక రికార్డును సృష్టించబోతున్నారు. ఈ టైమ్ లోనే రికార్డు మెజార్టీని రప్పించుకోవాలని బీజేపీ ఎదురుచూస్తోంది.