పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఎప్పుడు విక్టిమ్ కార్డు వదలాలని , అందరి దగ్గర సింపథీ పొందాలని ఎదురు చూస్తుంటారు. వీలైనప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, నిధులు ఆపేస్తుందని ఆరోపిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా ఆమె తీరు మాత్రం మారడం లేదు. దీనితో ఈ సారి పక్కా లెక్కలతో మమతకు కేంద్రప్రభుత్వం సమాధానమిచ్చింది.ఏదో జరిగిపోతున్నట్లు మమత ఇప్పుడు బంగ్లార్ బోంచోనా (బెంగాల్ కు అన్యాయం) పేరుతో పెద్ద నినాదమే లేవనెత్తారు. బెంగాల్ కడుపు మాడ్చేయ్యాలనుకుంటే కుదరదని ఆమె ప్రకటించారు. అన్నింటికీ కేంద్రం సమాధానమిచ్చింది..
దాదాపు ఏడు లక్షల కోట్లిచ్చామన్న కేంద్రం…
గత ఐదేళ్లలో బెంగాల్ కు ఇచ్చినదేమిటో కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్పింది. నిధులు, గ్రాంట్ల కింద రూ. 5.36 లక్షల కోట్లు ఇచ్చామని ప్రకటించింది. ఆహార సబ్సిడీ కోసం రూ. 80 వేల కోట్లు విడుదల చేసింది. ఎరువుల సబ్సిడీ కింద రూ. 30 వేల కోట్లు ఇచ్చింది. ఇంతకంటే ఏం చేయాలని మమతను బీజేపీ ప్రశ్నిస్తే ఆమె నీళ్లు నమిలే పరిస్థితి ఏర్పడింది…
గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట…
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చే నిధులు ఆపేశారని ఇటీవల మమత ఆరోపించారు. 21 లక్షల మంది ఉపాధి కూలీల కడుపు కొడుతున్నారంటూ ఆమె ధర్నా చేశారు. ఆ స్కీమ్ కింద బెంగాల్ నేతలు అవినీతి చేసినందునే వాటి లెక్క తేల్చేందుకు తాత్కాలికంగా నిధులు ఆపినట్లు కేంద్రం ఒప్పుకుంది. బెంగాల్ లో గ్రామీణాభివృద్ధి కోసం రూ. 93,171 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కేంద్రం గుర్తు చేసింది.గ్రామీణాభివృద్ధికి ఇచ్చే గ్రాంట్లలో బెంగాల్ మొదటి స్థానంలో ఉందని, గత ఆరేళ్లుగా అదే స్థానంలో కొనసాగుతోందని ప్రకటించింది. యూపీఏ హయాంతో పోల్చుకుంటే గ్రామీణాభివృద్ధి గ్రాంట్లు మోదీ పాలనలో 170 శాతం పెరిగాయన్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద రూ. 2,151 కోట్లు, పట్టణాభివృద్ధి పథకాల కింద రూ. 13,649 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద బెంగాల్ పట్టణ ప్రాంతాలకు 4 లక్షల 89 వేల 959 ఇళ్లు మంజూరు చేశామన్నారు. బెంగాల్ లో ఆరు కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందుతోందన్నారు…
మహిళా సంక్షేమానికి పెద్ద పీట..
మహిళలు, గిరిజన, అణగారిన వర్గాలకు కేంద్రం ప్రాధాన్యమిస్తోందని తాజా ప్రకటనలో వెల్లడించారు. గత ఆరేళ్లలో మహిళా సంక్షేమ కార్యక్రమాలకు రూ. 5,744 కోట్లు బెంగాల్ కు విడుదల చేశామన్నారు. బాలికల కోసం 14 లక్షల బ్యాంకు ఖాతాలు తెరిచామన్నారు. గిరిజన సంక్షేమానికి రూ. 834 కోట్లు ఇచ్చామన్నారు. రక్షణశాఖలోని పబ్లిక్ రంగ సంస్థలకు రూ. 24 వేల కోట్ల నిధులు అందించామన్నారు. మోదీ హయాంలోనే హాల్దియాలో మల్టీ మోడల్ టర్మినల్ పూర్తయ్యిందన్నారు. రైల్వే బడ్జెట్లోనూ బెంగాల్ కు 173 శాతం వృద్ధి కనిపించిందన్నారు. ఐనా మమత విమర్శిస్తుంటే అది ఆమె ఇష్టమని బీజేపీ తేల్చేసింది…