సమ్మర్ వచ్చేసింది..వేడి పెరుగుతోంది. ఫ్యాన్ గాలి సరిపోవడం లేదు. ఇప్పటికే చాలా మంది ఇళ్లలో ఏసీలు మోగుతున్నాయ్. సాధారణ రోజుల కన్నా వేసవిలో AC వాడకం ఎక్కువ కాబట్టి కరెంట్ బిల్లు కూడా అలాగే పేలిపోతుంది. అందుకే ఎంచక్కా AC వాడుకోవాలి..బిల్లు పెరగకూడదు అంటే కొన్ని టిప్స్ పాటించండి…
మరీ తక్కువ ఉష్ణోగ్రత పెట్టొద్దు
ఏసీని ఎప్పుడూ తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉంచకూడదు. 16 లేదా 18 డిగ్రీల వద్ద ఉంచడం ద్వారా AC మంచి కూలింగ్‌ని ఇస్తుందనుకుంటారు కానీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) ప్రకారం.. మానవ శరీరానికి అనువైన ఉష్ణోగ్రత 24..ఈ నంబర్ దగ్గర ఉంచడం మంచిది. ఓ వైపు విద్యుత్తు ఆదా అవుతుంది…ఎందుకంటే ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచితే 6 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది.
అన్నీ జాగ్రత్తగా లాక్ చేయండి
ఏసీ ఆన్ చేసేసి కిటికీలు, తలుపులు తెరిచేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. చివరకు రూమ్ లో ఉన్న షెల్పులు కూడా మూసి ఉంచడమే మంచిది. ముందే ఇలా చేయడం వల్ల వేడిగాలి రావడం ఆగుతుంది..చల్లగాలి లోపలే ఉండి రూమ్ త్వరగా కూల్ అవుతుంది. విద్యుత్ ఆదా అవుతుంది
స్లీప్ మోడ్ వాడడం మంచిది
ఈ రోజుల్లో చాలా ఏసీలు స్లీప్ మోడ్ ఫీచర్‌తో వస్తున్నాయి. ఈ మోడ్ దాదాపు 30 శాతం విద్యుత్తును ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది. దీని వల్ల మీకు అతిగా చల్లదనం రాదు. మీకు కావాల్సినంత చల్లదనం వచ్చాక, ఏసీని ఆటోమేటిక్‌గా స్లీప్ మోడ్‌లోకి వెళ్లేలా చెయ్యవచ్చు.
ఫ్యాన్ తప్పనిసరి
ACతో ఫ్యాన్‌ని ఉపయోగిస్తే.. అది గదిలోని ప్రతి మూలకూ AC గాలిని ప్రసారం చేస్తుంది. ఇది గదిని చల్లగా ఉంచుతుంది. అందువల్ల మీరు ఏసీ ఉష్ణోగ్రతను కూడా భారీగా తగ్గించాల్సిన అవసరం ఉండదు. విద్యుత్ ఆదా అవుతుంది.