ఆమదాలవలస నియోజకవర్గంలో అధికార పార్టీని గ్రూపుల గోల వెంటాడుతోంది. వైసిపి నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ విస్తృత సమావేశానికి సువ్వారి గాంధీ గ్రూపు గైర్హాజరైంది. నియోజకవర్గ స్థాయి వైసిపి నాయకులు, కార్యకర్తలతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించగా, వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి హాజరయ్యారు. కానీ కీలక నేతలు హాజరు కాలేదు.
కీలక అనుచరుల్ని దూరం చేసుకున్న తమ్మినేని సీతారాం
మళ్లీ తమ్మినేని సీతారాంకే టిక్కెట్ ఇస్తారన్న ప్రచారంతో సువ్వారి గాంధీ, కోట గోవిందరావు గ్రూపులు దూరంగా ఉన్నాయి. సమావేశం చివరిలో చింతాడ రవికుమార్ హాజరైనా ఆయనను వేదికపైకి పిలవలేదు. దీంతో వేదిక కిందే కార్యకర్తలతో ఉండిపోయారు. ఆయన తనకు అవమానం జరిగిందని ఫీలవుతున్నారు. ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం, ఎమ్‌పిగా పేరాడ తిలక్ పోటీ చేస్తున్నారని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
.అసమ్మతి నాయకుల దారెటు ?
స్థానిక సంస్థల ఎన్నికల నుండి స్పీకర్ తమ్మినేని సీతారాం, సీనియర్ నాయకులు సువ్వారి గాంధీ మధ్య నెలకొన్న మనస్పర్థలు నేటికీ చల్లారడం లేదు. రాష్ట్ర, జిల్లా నేతలు ఎన్నిమార్లు సర్దిచెప్పినప్పటికీ నేటికి వారి మధ్య సయోధ్య కుదరకపోవడం గమనార్హం. తాజాగా విస్తృతస్థాయి సమావేశానికి వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ కోఆర్డినేటర్ మధ్య శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ హాజరైనా, వైసిపి వ్యతిరేక గ్రూపులుగా ఉన్న సువ్వారి గాంధీ, సీనియర్ నాయకులు కోట గోవిందరావు హాజరు కాకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఎన్నికల నాటికి పరిస్థితులు ఎటువైపు మళ్లుతాయోనని వైసిపి శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తమ్మినేనికి టిక్కెట్ ఇస్తే ఓడిస్తామంటున్న వ్యతిరేక గ్రూపులు
తమ్మినేని సీతారాంకు టిక్కెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని వ్యతిరేక గ్రూపులు చెబుతున్నాయి. తమను ఐదేళ్ల పాటు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని అంటున్నారు. స్పీకర్ గా తనకు ఉన్న అధికారాలతో.. నియోజకవర్గంలో కనిపించిన ఇసుక.. ఇతర క్వారీలపై పూర్తిగా తన అధిపత్యం చూపించుకోవడం… ఇతర నేతల్ని ఎదగనీయకుండా తన కుమారుడికే పెత్తనం ఇవ్వడం వల్ల ఎక్కువ సమస్యలు వచ్చాయని భావిస్తున్నారు.