కుక్కర్లు, చీరలు.. గిఫ్టులే గిఫ్టులు – ఏపీలో ప్రలోభాల వల

పోలింగ్‌కు ముందు ఎలక్షనీరింగ్ పేరుతో జరిగే ప్రలోభాలు ఈ సారి ఏపీలో ముందే కూస్తున్నాయి. విందులు చేస్తున్నాయి. ఓటరైనా సరే… కాస్త ఉపయోగపడతాడనుకున్నా సరే… వచ్చి వాలిపోతున్నారు. ఇవ్వాలనుకున్నది ఇచ్చేసెయ్‌… కోరుకున్నది కొట్టేసెయ్‌ అన్నట్టుగా చెలరేగిపోతున్నారు.

మహిళలకు చీరలు, కుక్కర్ల పంపిణీ

ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, మహిళల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ముందుగా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటేనే గట్టెక్కుతానని ఎక్కువ మంది నేతలు నమ్ముతున్నారు. ఇటీవల చేయూత, ఆసరా పథకాల పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. మండలాల వారీగా రెండు మూడు సభలను పెట్టి డ్వాక్రా సంఘాలను ఆహ్వానిస్తున్నారు. వచ్చిన మహిళలు అందరికీ కానుకలు ఇచ్చేస్తున్నారు. ఈ కానుకల విషయంలో ఒక్కొక్కళ్దది ఒక్కో స్టైల్. ఎక్కువగా వాలంటర్లను మచ్చిక చేసుకునేందు్కు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులతో మీటింగ్ పెట్టి.. మీటింగ్‌ అయ్యాక ఒక్కో వాలంటీర్‌కు ఐదువేల రూపాయల చొప్పున స్వీట్‌ బాక్స్‌లో పెట్టి ఇస్తున్నారు. ప్రతి వాలంటీర్‌ తన పరిధిలోని 50 కుటుంబాల ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయించాలని, అండగా నిలవాలని కోరుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మహిళా ఓటరుకు చీర చేరాలన్న టార్గెట్‌తో కొంత మంది ఇంచార్జులు కానుకలు పంపిణీ చేశారు.

విందులు వినోదాలు కూడా !

మహిళా టీచర్లు, అంగన్వాడి వర్కర్లకు, మెప్మా సిబ్బందికి చీరలు స్వీట్లు అందించారు. విందు కూడా ఏర్పాటు చేసి మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో అధికార పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది. కానుకల పంపిణీకి ఇబ్బందులు లేవు కానీ ఇతరులు పంపిణీ చేయాలని చూస్తే మాత్రం పోలీసులు వచ్చేస్తున్నారు. పుంగనూరు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆ గత నెలలో గోడ గడియారాలు తెప్పిస్తుంటే, మొత్తం స్వాధీనం చేసుకున్నారు. అధికారపక్షంలోని వారికి ఒకరు రూల్.. నాకు మాత్రమే మరో నిబంధన ఉంటుందని రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. ఈయనతో పాటు టీడీపీకి చెందిన వారు అనేక నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తున్నారు.

అసలు ఎన్నికల్లో ఖర్చు ఎలా ఉంటుందో ?

కోడ్ రాక ముందే ఇలా కానుకలు పంపిణీ చేస్తూంటే.. ఇక కోడ్ వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి అంచనా వేయలేమన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి దక్షిణాదిలో ఎన్నికల ఖర్చు ఎక్కువ. ప్రతీ ఎన్నికకు ఓ కొత్త రికార్డు తయారవుతోంది. ఈ సారి కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. ఎన్ని వేల కోట్లు పార్టీలు ఖర్చు చేస్తాయోనన్న చర్చ జరుగుతోంది.