తిరుగులేని మోదీ పాపులారిటీ..

ప్రధాని మోదీ..దేశం రాజకీయాల్లో వినిపించే ఏకైక పేరు. భారత్ అంటే మోదీ, మోదీ అంటే భారత్ అన్నంతగా పాపులారిటీ పెరిగిపోయింది. మోదీ వేసే ప్రతీ అడుగు ప్రజాసంక్షేమాన్ని కాంక్షించి మాత్రమే వేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసం రోజురోజుకు పెరుగుతోంది. మేకిన్ ఇన్ ఇండియా నుంచి అయోధ్య రామాలయం వరకు మోదీ చేపట్టిన ప్రతీ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. తాజా సర్వేలు కూడా మోదీకున్న ప్రజాదరణకు దర్పణం పడుతున్నాయి…

59 శాతం మంది ఓటర్ల మద్దతు

న్యూస్ 18 మీడియా సంస్థ కోసం నెట్ వర్క్ 18 ఓ సర్వే నిర్వహించింది. 21 రాష్ట్రాల్లో ఉన్న 518 లోక్ సభా నియోజకవర్గాల్లో లక్షా 18 వేల 616 మంది అభిప్రాయాలు తెలుసుకున్నది. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 1 వరకు సర్వే నిర్వహించిన అందులోని అంశాలను విశ్లేషించింది. తదుపరి ప్రధానిగా ఎవరికి మద్దతిస్తారన్నది సర్వేలో అడిగిన ప్రధాన ప్రశ్న. దేశంలోని అత్యధిక శాతం మంది మోదీ మూడో సారి ప్రధాని కావాలని కోరుకున్నారు. ఈ క్రమంలో 59 శాతం మంది భారతీయులు మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఎదురుచూస్తున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 21 శాతం మంది మాత్రమే మద్దతిస్తున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 9 శాతం మంది, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు 9 శాతం మంది మద్దతిస్తున్నారు. మిగిలిన ముగ్గురికి వచ్చిన ఓట్లను కలుపుకున్నా కూడా.. మోదీతో సరితూగని పరిస్థితి ఉంది…

అభ్యర్థి కాదు.. మోదీ పరపతే ముఖ్యం…

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన రెండో జాబితాను ప్రకటించింది. అందులో పలువురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి.కొందరికి టికెట్ నిరాకరించారు. ఈ క్రమంలో సర్వే మాత్రం ఒక అంశాన్ని నిగ్గుతేల్చింది. లోక్ సభ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరన్నది అప్రస్తుతంగా జనం భావిస్తున్నారు. మోదీని చూసి,ప్రధానిగా ఆయన చేసిన మంచి పనులను చూసి ఓటేస్తామని 85 శాతం మంది జనం అభిప్రాయపడ్డారు. మోదీపై ఉన్న విశ్వాసమే తమను పోలింగ్ కేంద్రాలకు రప్పిస్తోందని వారు చెప్పుకున్నారు…

అతి పెద్ద రాష్ట్రంలో క్లీన్ స్వీప్

ఉత్తర ప్రదేశ్ లో 80 లోక్ సభా స్థానాలున్నాయి. జనాభా పరంగా అది అతి పెద్ద రాష్ట్రం. 20 కోట్లకు పైగా జనం ఆ రాష్ట్రంలో ఉంటారు. తాజా సర్వే ప్రకారం బీజేపీకి యూపీలో 77 లోక్ సభా స్థానాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదీ సరికొత్త రికార్డు కూడా అవుతుంది. ఇండియా గ్రూపుకు నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలకు కలుపుకుని వచ్చేదీ రెండు స్థానాలు మాత్రమే. ఇక మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంటుంది.ఈ ఫలితం విపక్షాలకు చెంపపెట్టులాంటిదని చెప్పుకుంటుండగా, మోదీ జయభేరీ మోగించబోయే సన్నివేశానికి చాలా కారణాలే ఉన్నాయి. గత ఏడేళ్లలో యూపీ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పుకు బీజేపీ పాలనే కారణమని చెబుతున్నారు. రాష్ట్రంలోకి ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు వచ్చాయి. మౌలిక సదుపాయాలు మెరుగు పడటమే కాకుండా ఎక్స్ ప్రెస్ వేల నిర్వాణం ఊపందుకుంది. సామాన్యుల ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంది. దానితో పాటుగా రామాలయ నిర్మాణంతో యూపీ ప్రజలంతా మోదీ అభిమానులు మారిపోయారు…