అణగారిన సామాజిక వర్గాలకు బీజేపీ ప్రాధాన్యం

లోక్ సభ ఎన్నికలకు బీజేపీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కి వస్తోంది. రాష్ట్రాన్ని బట్టి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మిత్రక్షాలతో ఒడంబడికలకు కొంత టైమ్ తీసుకుంటున్న బీజేపీ..ఎవరినీ నిరాశ పరచకుండా, అందరికీ సమానావకాశాలు ఇచ్చే విధంగా పొత్తులు, సీట్ల సర్దుబాటు ఖరారు చేసుకుంటోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే ఫార్ములాతో పొత్తు భాగస్వాములందరినీ సంతృప్తి పరిచే దిశగానే బీజేపీ అడుగులు వేస్తోంది. పైగా దళిత పార్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కమలం పార్టీ డిసైడైంది…

చిరాగ్ పార్టీకి 5 లోక్ సభా స్థానాలు

తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ చనిపోయిన తర్వాత చిరాగ్ పాశ్వాన్ కొన్ని రోజులు బీజేపీకి దూరంగా, ఎన్డీయేకు వెలుపల గడిపారు. ఆయన బాబాయి పశుపతి పరస్ కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వేళ లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లోని రెండు వర్గాలను సంతృప్తి పరిచే ఫార్ములాతో దళిత వర్గాలను ప్రోత్సహించాలని బీజేపీ నిర్ణయించుకుంది. చిరాగ్ పాశ్వాన్ వర్గానికి ఐదు లోక్ సభా స్థానాలు కేటాయించింది. బిహార్లోని హాజిపూర్, వైశాలీ, జమూయి, సమస్తీపూర్, ఖగారియా స్థానాల్లో చిరాగ్ పాశ్వాన్ వర్గం పోటీ చేస్తుంది. ఈ క్రమంలో ఎన్డీయే మరింత బలపడుతుందని బీజేపీ పెద్దలైన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంచనా వేసుకుంటున్నారు…

పశుపతి పరస్ కు గవర్నర్ పదవి

చిరాగ్ పాశ్వాన్ ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ప్రధాని మోదీ తనకు గురువని, దేవుడితో సమానమని ఆయన చెప్పుకుంటారు. దేశ ప్రగతి బీజేపీతోనే సాధ్యమని, ఆ పార్టీకి సహకరించడం భారతీయుడిగా తన కర్తవ్యమని ఆయన అంటుంటారు. అలాంటి దేశభక్తులు తమ కూటమిలో ఉండాలని నిర్ణయించిన ప్రధాని మోదీ.. ఎల్జేపీకి ఐదు లోక్ సభా స్థానాలు కేటాయించారు. రాజీకి ఒప్పుకున్న పసుపతి పరస్ కు గవర్నర్ పదవి ఇస్తామని హామీ పలకడంతో ఆయన మెత్తబడ్డారు. తాము లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరో పక్క పరస్ వర్గానికి చెందిన సమస్తీపూర్ ఎంపీ ప్రిన్స్ రాజ్ కు బిహార్ మంత్రివర్గంలో చోటిస్తారు. ఆయన కూడా చిరాగ్ పాశ్వాన్ కు బంధువే అవుతారు..

మాంఝీ, కుష్వాహాకు కూటమిలో స్థానం

ఎన్నికల కోసం బిహార్లో ఏర్పాటు చేయబోతున్న కూటమిలో మరో ఇద్దరు దళిత నేతలకు కూడా అవకాశం కల్పించాలని తీర్మానించారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఒక చిన్న పార్టీ నేత అయినా జితన్ రాం మాంఝీతో పాటు మరో దళిత నేత ఉపేంద్ర కుష్వాహా కూడా లోక్ సభ ఎన్నికల్లో తలా ఓ సీటు కేటాయించేందుకు బీజేపీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూకు కొన్ని స్థానాలు తగ్గించాలని నిర్ణయించింది. అందుకు నితీశ్ కుమార్ కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఆయనకు లోక్ సభ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలే ముఖ్యం…