ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. ఏ పార్టీ ఎన్ని స్థానల్లో పోటీ చేస్తాయనే అంశంపైనా క్లారిటీ వచ్చేసింది. టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగాలని నిర్ణయించారు. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది బీజేపీ, జనసేనకు కేటాయించే స్థానాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బీజేపీకి కేటాయించబోయే అసెంబ్లీ సీట్లేమిటి ?
శ్రీకాకుళం, పాడేరు, విశాఖ ఉత్తరం, అనపర్తి, పి.గన్నవరం, కైకలూరు, గుంటూరు వెస్ట్, మదనపల్లె, రాజంపేట, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్లు,, కదిరి వంటి సీట్లలో కొన్ని స్థానాలను బీజేపీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పోటీ చేస్తారనుకునే స్థానాల్లో.. విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్రాజు, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, పి.గన్నవరం నుంచి అయ్యాజీ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అలాగే మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తనకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో పొత్తుల్లో భాగంగా కదిరిలో బీజేపీ గెలుపు – ఈ సారి కేటాయించే అవకాశం
టీడీపీ, బీజేపీ పొత్తులు పెట్టుకుంటే ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి కదిరి నియోజకవర్గం. 1999లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించింది. ఈ సారి కూడా గెలుపు ఖాయం అవుతుంది. గెలుపే టార్గెట్ కాబట్టి ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చాలా కాలంగా ఈ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.
లోక్సభ సీట్లలోనూ పోటీకి సీనియర్లు !
లోక్సభ సీట్ల విషయానికి వస్తే.. ఆరు నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం నుంచి పురందేశ్వరి, తిరుపతి నుంచి మునిసుబ్రహ్మణ్యం, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, అరకు నుంచి కొత్తపల్లి గీతల పేర్లు వినిపిస్తున్నాయి. మిగిలిన స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ, జనసేన పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక పనిలో ఉన్నాయి. త్వరగా అభ్యర్థుల్ని, మేనిఫెస్టోను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని మూడు పార్టీలు భావిస్తున్నాయి. అలాగే టీడీపీ జనసేన బీజేపీల మధ్య సమన్వయం చేసుకుని.. ఆయా నియోజకవర్గాల్లో ముందుకు సాగాలని భావిస్తున్నారు.