సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని ప్రధాని మోదీ నేతృత్వంలో తరచూ నిరూపితమవుతూనే ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా బీసీలు, అణగారిన వర్గాలకు రాజకీయ పదవులు ఇచ్చేందుకు మోదీ ఎన్నడూ వెనుకాడలేదు. ఇంతకాలం వివక్షకు గురైన వారికి ఇప్పటికైనా సమాన హక్కులు కల్పించాలని మోదీ తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగిపోయిన వర్గాలను ఇప్పుడు పైకి తీసుకురావాలన్న మోదీ సంకల్పం ప్రతీ అడుగులోనూ కనిపిస్తుంది….
హరియాణా ముఖ్యమంత్రిగా సైనీ
బీసీ సామాజిక వర్గానికి చెందిన నయబ్ సింగ్ సైనీ .. హరియాణా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో మనోహర్ లాల్ ఖట్టర్ దిగిపోయి ఆయనకు అవకాశమిచ్చారు. పొత్తు భాగస్వాముల మధ్య ఏర్పడిన పొరపచ్చాల కారణంగా ప్రభుత్వం మారాల్సి వచ్చినప్పుడు ఒక బీసీ నాయకుడికి అవకాశం ఇవ్వాలని మోదీ తీర్మానించుకోవడం విశేషం. మోదీకి అత్యంత విధేయుడిగా కూడా సైనీకి పేరుంది..పార్టీలో క్రమశిక్షణకు మారుపేరన్న కితాబు అందుకున్నారు. వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల కోసం సైని నిత్యం పోరాడుతూ ఉంటారు.
2014 నుంచి లైమ్ లైట్
సైనీ గత పదేళ్లుగా పొలిటికల్ లైమ్ లైట్లో ఉన్నారు. 2014లో నారాయణ్ ఘర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. రెండేళ్లలోనే కేబినెట్ మంత్రి అయ్యారు. 2019లో కురుక్షేత్ర లోక్ సభా స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. గత అక్టోబరులో ఆయన హరియాణా బీజేపీ అధ్యక్షుడయ్యారు. నిజానికి ఓబీసీ వర్గానికి చెందిన సైనీ, మాజీ ముఖ్యమంత్రి ఖట్టర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పాలి. ఆయనకి ఇంత ఫేమ్ రాత్రికి రాత్రి వచ్చింది మాత్రం కాదు. కష్టపడి పైకి వచ్చిన నాయకుడు సైనీ. అంబాలా దగ్గరి ఒక చిన్న గ్రామంలో పుట్టిన సైనీ, తొలుత ఆరెస్సెస్ లో పనిచేశారు. భారతీయ జనతా యువ మోర్ఛా (బీజేవైఎం) జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. తర్వాత బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో పడ్డారు.
సామాజిక సమీకరణాలను లెక్కగట్టి…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొంతకాలంగా కుల గణనపై దుమారం రేపేందుకు ప్రయత్నిస్తున్నారు. కులగణన అవసరమని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేసి చూపిస్తామని ప్రకటిస్తున్నారు. జనాభాకు బట్టి అవకాశాలు రావాలని (జిత్న ఆబాదీ, ఉత్నా హక్) ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైనీకి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం ద్వారా అందరి హక్కులను కాపాడతామని బీజేపీ చెప్పుకున్నట్లయ్యింది. హరియాణాలో జాట్లు, జాట్ సిక్కులు ఇద్దరూ వెనుకబడిన వర్గాల జాబితాలోకే వస్తున్న తరుణంలో ఆ విభజనను చెరిపేసేందుకు, అందరికీ సమానావకాశాలు కల్పించినట్లు నిరూపించేందుకు తాజా పరిణామాలను బీజేపీ వాడుకున్నట్లుగా చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఇంకా 50 రోజులు కూడా లేని తరుణంలో… హరియాణాలో పార్టీని విజయతీరాలకు చేర్చడం ఇప్పుడు సైనీ ముందున్న ప్రథమ కార్తవ్యమని చెప్పక తప్పదు. ఆ దిశగా ఆయన విజయం సాధిస్తారని పార్టీ పెద్దలకు విశ్వాసం ఉన్నందునే సీఎం పదవిని కట్టబెట్టారు.