పోటీకి భయపడుతున్న కాంగ్రెస్ సీనియర్లు…

రాజకీయాలంటే ఎన్నికలు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం. ఓడిపోయినప్పుడు గెలుపోటములు సహజమేనని స్పోర్టివ్ గా తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇంతకాలం పదవులను అనుభవించిన కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు పార్టీ అథోగతి పాలైందని తెలుసుకుని పోటీకి దూరంగా ఉండేందుకే ఇష్టపడుతున్నారు.పోటీ చేయాలని ఎవరైనా సలహా ఇస్తే వారిపై ఎగిరెగిరి పడుతున్నారు. మీ పని మీరు చూసుకోండని సలహా ఇస్తున్నారు….

రాజ్యసభ చాలంటున్న మల్లికార్జున్ ఖర్గే…

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజ్యసభ సీటు తీసుకున్న ఆయన ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనంటున్నారు. తొమ్మిద్ సార్లు గుల్బర్గా ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు లోక్ సభ ఎంపీగా గెలిచిన ఆయన 2019లో ఓడిపోయారు. ఈ సారి కూడా కర్ణాటకలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని గ్రహించిన ఖర్గే.. బరిలోకి దిగేందుకు ఇష్టపడటం లేదు. అదేమంటే దేశవ్యాప్తంగా ప్రచారానికి తిరగాల్సి ఉన్నందున లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగడం లేదని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు..ఇంతకాలం కాంగ్రెస్ అధ్యక్షులు తప్పక లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేవారు. మొదటి సారి సోనియా, ఖర్గే ఇద్దరూ పోటీకి దూరంగా ఉంటున్నారు. ఈ పర్యాయం గుల్బర్బా నియోజకవర్గం నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణన్ దొడ్డమానీ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.

మధ్యప్రదేశ్ , రాజస్థాన్ లో అదే పరిస్థితి…

కాంగ్రెస్ వెటరన్న్ లో చాలా మంది దణ్ణం పెట్టి మరీ లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేదే లేదని చెబుతున్నారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ ఈ సారి జారోలే నుంచి పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ ను ఛింద్వారా నుంచే మరో సారి బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్ ఇద్దరినీ లోక్ సభకు పోటీ చేయాలని వర్తమానం పంపినా వాళ్లు అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. తనకు అలాంటి ఉద్దేశాలు లేవని గెహ్లాట్ కుండబద్దలు కొట్టేశారు. ఎందుకంటే రాజస్థాన్లో ఈ సారి కూడా బీజేపీ అభ్యర్థులను ఓడించడం కష్టమని ఆయనకు తెలుసు.

ఉత్తరాఖండ్ లోనూ అదే పరిస్థితి….

పర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్ లో ముగ్గురు సీనియర్లు పోటీకి ససేమిరా అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు హరిద్వార్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం ఆఫరిచ్చింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత యష్పాల్ ఆర్యాను కుమావోన్ నుంచి పోటీ చేయాలని కోరింది.తమ వల్ల కాదని ఇద్దరు చేతులెత్తేశారు. సీనియర్లు పోటీ చేయాలని ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షుడు కరణ్ మహరా విజ్ఞప్తి చేసినా పట్టించుకునే వాళ్లు లేరు. అంతగా అవసరమైతే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని హరీష్ రావత్ సూచిస్తున్నారు. ఇక సీనియర్ ప్రీతం సింగ్ కు లోక్ సభ టికెట్ ఆఫర్ చేసినా ఆయన ఆసక్తి చూపడం లేదు. ఇక అసోంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. దానితో పార్టీలో క్రియాశీలంగా ఉంటూ పోటీ చేసే వారి కోసం కాంగ్రెస్ పెద్దలు వెదుకుతున్నారు..