ఆ కూటమిలో ఓ క్రమశిక్షణ లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వాళ్లు ఉంటారు. వాళ్లలో ఒకళ్లంటే ఒకరికి అసలు పడదు. అధికారం కోల్పోయినప్పటి నుంచి వారిలో విభేదాలు పొడసూపాయి. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ విభేదాలు తారా స్థాయికి చేరాయి. పొత్తు ధర్మాన్ని మరిచి… అభ్యర్థుల ప్రకటన చేస్తున్నాయి.. వీధిన పడి కొట్టుకునేంత పనిచేస్తున్నాయి. అదే మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ)
చర్చలు సాగుతుండగానే అభ్యర్థి ప్రకటన..
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ గ్రూపు, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొనసాగుతూ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ లోపే మాజీ సీఎం తొందరపడినట్లుగా కనిపిస్తోంది. పొతు ఉన్న సంగతి మరిచిపోయి అభ్యర్థిని ప్రకటించేశారూ ఉద్ధవ్. వాయువ్య ముంబై నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా అమోల్ కిర్తీకార్ పోటీలో ఉంటారని చెప్పేశారు. సీట్ల సర్దుబాటు ఫార్మలాపై ఏకాభిప్రాయం రాకముందే ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ఎంపీ గజానన్ కిర్తికార్ కుమారుడే అమోల్. నిజానికి గజానన్ ఇటీవల ఏక్ నాథ్ షిండే వర్గంలోకి వెళ్లిపోయినప్పటికీ అమోల్ మాత్రం ఉద్ధవ్ గ్రూపులోనే ఉండిపోయారు. అతని భక్తికి మెచ్చి వరమిచ్చినట్లుగా ముందే అమోల్ పేరును ప్రకటించారు. దీనితో స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్.. ఆ సీటు తనకు వస్తుందని ఎదురు చూశారు. అయితే సీన్ రివర్స్ కావడంతో ఇప్పుడాయన ఠాక్రే తీరుపై ఎగిరెగిరి పడుతున్నారు..
నెల క్రితం ఆదిత్య ఠాక్రే తొందరపాటు
తండ్రి చేసిన పనే నెల క్రితం ఆదిత్య ఠాక్రే చేశారు. గిర్గావ్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించినప్పుడు పార్టీ తరపున ముంబై దక్షిణ లోక్ సభ నియోజకవర్గం నుంచి అరవింద్ సావంత్ పోటీ చేస్తారని ప్రకటించేశారు. దీనితో అప్పటి వరకు ముంబై దక్షిణపై ఆశలు పెట్టుకున్న మిలింద్ దేవరా తక్షణమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. షిండే నేతృత్వ శివసేనలో చేరి రాజ్యసభ సభ్యత్వాన్ని తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ముంబై దక్షిణ సీటును ఆశించి… పార్టీ పెద్దలు ఉద్ధవ్ ను సమాధానపరుస్తారని ఎదురుచూసిన మిలింద్ దేవరా గత్యంతరం లేకనే ఎంవీఏ నుంచి వైదొలిగారని చెప్పాల్సి ఉంటుంది…
ఉద్ధవ్ సేనలో విభేదాలు
ఉద్ధవ్ నేతృత్వ శివసేనలో చాలా మంది అసంతృప్తి నేతలున్నారు. ఎలాంటి పదవులు దక్కకపోవడంతో వారంతా ఇప్పుడు పార్టీ అధిష్టానంపై ఆగ్రహం చెందుతున్నారు. అందులో మాజీ మంత్రి భాస్కర్ జాధవ్ కూడా ఉన్నారు. ఆయన పార్టీ శాసనసభాపక్ష నేత పదవిని ఆశించి ఇంతవరకు సాధించుకోలేకపోయారు. ఉద్ధవ్ వెంట ఉండి ప్రయోజనం ఏమిటన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు..