చిలకలూరిపేట వైసిపి సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడును మారుస్తున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఈ మేరకు మంగళవారం వైసిపి విడుదల చేసే జాబితాలో ఉమ్మడి జిల్లాలో పలువురు అభ్యర్థుల మార్పు జరగనుందని ప్రచారం జరుగుతోంది.
చిలుకలూరిపేటకు కొత్త అభ్యర్థే
చిలకలూరిపేటకు తొలుత మంత్రి అంబటి రాంబాబు వస్తారని ప్రచారమైనా ఆయన ఆసక్తి చూపకపోవడంతో చివరిగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడి పేరును సిఎం జగన్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ మేరకు మనోహర్ నాయుడు సోమవారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లి వైసిపి ముఖ్య నాయకులతో చర్చించినట్టు తెలిసింది. అయితే రాజేష్ నాయుడు గత మూడునెలలుగా చిలకలూరిపేటలో చురుగ్గా పనిచేస్తున్నా ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో అధిష్టానం ఆశించిన విధంగా ఖర్చు చేయడం లేదని భావించి మార్పు చేస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.
మల్లెల రాజేష్ నాయుడు చురుగ్గా లేకపోవడంతో సమస్య
చిలకలూరిపేటలో మంత్రి విడదల రజనిని గుంటూరు పశ్చిమకు మార్పు చేసి మూడునెలల క్రితం రాజేష్ నాయుడికి అవకాశం ఇచ్చారు. అయితే మంత్రి రజని ఆయనకు సహకరించడం లేదనే వాదనా ఉంది. గుంటూరుపశ్చిమ సీటు ఆశించిన మేయర్ కావటి మనోహర్ నాయుడ్ని ఇప్పుడు మూడు నెలల తరువాత చిలకలూరిపేటకు మార్చడం విడ్డూరంగా ఉందని వైసిపి నాయకులు వాపోతున్నారు. సహజంగా రాజకీయాల్లో నేను లోకల్ అనే నినాదం గెలిచే వారిని చూశామని కానీ అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మార్పులు జరగడం ఈసారి ఎన్నికల్లో విచిత్రంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎంపీ అభ్యర్థిగా రోశయ్య కొనసాగుతారా ?
గుంటూరు లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేసిన కిలారి రోశయ్య ఇంకాపూర్తి స్థాయిగా చురుగ్గా ప్రచారంలోకి దిగలేదు. ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆయనింకా పూర్తిగా ముఖాముఖి సమావేశాలు జరగలేదు. ఆయన కొనసాగుతారా మార్పులుంటాయా అనేది వైసిపి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలపై అస్పష్టత కొనసాగుతోంది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు కొనసాగుతారా? లేక మరొకరికి అవకాశం ఇస్తారా? అనే గందరగోళం నెలకొంది. మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డికి సత్తెనపల్లిలో అవకాశం ఇస్తారని తెలిసింది.