టిడిపి, జనసేన పొత్తులో భాగంగా జిల్లాకు సంబంధించి ఇటీవల వెలువరించిన జాబితాలో టెక్కలి, ఇచ్ఛాపురం, ఆమదాలవలస నియోజకవర్గాలకు పార్టీ అధినేత చంద్రబాబు పేర్లను ప్రకటించారు. బిజెపితో పొత్తు అంశం తేలాక తర్వాత జాబితా వెలువరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. బిజెపితో పొత్తు కుదరడం, మరోవైపు అమరావతిలో సోమవారం మూడు పార్టీల నేతల మధ్య సీట్ల సర్దుబాటు వార్తలతో నియోజకవర్గ ఇన్‌ఛార్జిల్లో మరింత ఉత్కంత పెరిగిపోయింది.
గుండా లక్ష్మిదేవికీ ఖారారు కాని టిక్కెట్
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే నంబర్ వన్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న గుండ లక్ష్మీదేవి సైతం టిక్కెట్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పార్టీలో నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి 2019లో ఓడినా నాటి నుంచి పార్టీ పిలుపుల్లో భాగంగా ఆందోళనలు నిర్వహించడం, ప్రజల్లో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం చేస్తూనే ఉన్నారు. అసంతృప్తి, అసమ్మతి మాటలకు తావులేని శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్నికలకు రెండేళ్లు ముందు అంటే 2022లో పార్టీ పెద్దలు అసమ్మతి ఆజ్యం పోశారు. అందులో మాజీ ఎంపిపి తనయుడు గొండు శంకర్‌ను తెరపైకి తీసుకొచ్చి గ్రూపుల పోరుకు తెరతీశారు. గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గంలో టిడిపికి గడ్డు పరిస్థితిని తీసుకొచ్చారు.
అచ్చెన్న వర్గం వల్లే టీడీపీలో పోరాటాలా ?
పాతపట్నం, నరసన్నపేట, ఎచ్చెర్ల నియోజక వర్గాల్లో గ్రూపుల పోరు నెలకొంది. తగవులు తీర్చాల్సిన పార్టీ పెద్దలే పొగపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాతపట్నంలో టిడిపి ఓటమి తర్వాత నియోజకవర్గ బాధ్యతలను పార్టీ అధిష్టానం కలమటకు అప్పగించింది. అక్కడ ఇన్‌ఛార్జికి ఇబ్బంది పెట్టేలా టిడిపి నాయకుడు మామిడి గోవిందరావు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కలమటను వ్యతిరేకించే కొంతమంది నాయకులు గోవిందరావు పక్షాన చేరారు. నరసన్నపేటలో ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావుకే టిక్కెట్ వస్తుందని అంతా అనుకుంటున్న తరుణంలో పార్టీ పెద్దలు అక్కడ కొత్తగా మారో పేరును తెరపైకి తీసుకొచ్చారన్న చర్చ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు తనయుడు, వైద్యులు బగ్గు శ్రీనివాసరావూ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న వార్తలతో అక్కడి టిడిపిలో ఇబ్బంది మొదలైంది.
కళా వెంకట్రావు టిక్కెట్ కు దక్కని భరోసా
ఎచ్చెర్లలో పార్టీ సీనియర్ నేత కళా వెంకటరావు నియోజవకర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చూస్తున్నా… పార్టీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వల్పంగానైనా పార్టీ కేడర్ కొంత అటు వెళ్లింది. పలాస నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపుల పోరు లేకపోయినా సర్వేల ద్వారా అభ్యర్థిని నిర్ణయించాలనే ఉద్దేశంతో మొదటి జాబితాలో అధిష్టానం ప్రకటించలేదు. నియోజకవర్గంలో నెలకొన్న పార్టీ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలను అధిష్టానం వెయిటింగ్ లిస్టులో ఉంచినట్లు తెలుస్తోంది.