షుగర్ క్రేవింగ్స్ అంటే తీపి తినాలన్న కోరిక కలగడం. దీనికి సమయం, సందర్భం అవసరం లేదు. ఎప్పుడంటే అప్పుడు తినేయడమే. అదే ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే స్వీట్ తినాలన్న కోరిక కలిగినప్పుడు దాన్నుంచి బయటపడాలంటే కొన్ని ఆహారాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని సూచిస్తున్నారు. మరి షుగర్ క్రేవింగ్స్ ని తగ్గించే ఆహారాలేంటో తెలుసుకుందాం…
దాల్చిన చెక్క
ప్రతిరోజూ తినే ఆహారంలో దాల్చిన చెక్కను భాగం చేసుకోండి. లేదా పాలల్లో దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగండి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే తీపి తినాలనే కోరిక పెరగదు.
పెరుగు
రోజూ కప్పు పెరుగు తినడం అలవాటుగా మార్చుకోండి. దీనిలో ప్రోటీన్ తో పాటు ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. పెరుగు తినడం వల్ల చక్కెర పదార్థాలు తినాలన్న కోరిక తగ్గుతుంది. పెరుగులో ఒక స్పూన్ తేనె కలుపుకుని తింటే ఇంకా మంచిది. లేదా పెరుగులో తాజా పండ్ల ముక్కలను వేసుకుని తిన్నా మంచిదే. పైగా సమ్మర్లో ఇది ఆరోగ్యానికి అవసరం కూడా
అవకాడో
అవకాడో పండ్లు తినడం వల్ల తీపి పదార్థాలు తినాలన్న కోరిక తగ్గుతుంది. అవకాడోలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అవకాడోలను వారానికి రెండుసార్లు తినడం అలవాటు చేసుకోండి…స్వీట్ పై ఇంట్రెస్ట్ నెమ్మదిగా తగ్గుతుంది
బెర్రీలు
మార్కెట్లో ఎన్నో బెర్రీ జాతుల పండ్లు లభిస్తున్నాయి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు… ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిదే. వీటిని తరచూ తినడం వల్ల మీకు పంచదారతో చేసిన ఆహారాలు తినాలన్న కోరిక తగ్గిపోతుంది. ఈ బెర్రీ పండ్లు తినడం వల్ల క్యాలరీలు కూడా తక్కువగానే అందుతాయి. వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగవు.
నట్స్
బాదం, జీడిపప్పులు, వాల్ నట్స్ తరచూ తింటూ ఉండాలి. ఇవి చక్కెర తినాలన్న కోరికను తగ్గిస్తాయి. గింజలను తింటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉండేలా చేస్తాయి. ఇవి శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లను అందిస్తాయి.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఒత్తిడి, భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికం. కాబట్టి తీపి కోరికలను తగ్గిస్తుంది.
ఏవి తీసుకున్నా కానీ పరిమితంగానే ఉండాలి కానీ…ఆరోగ్యానికి మంచిదని అపరిమింతగా తింటే అనారోగ్య సమస్యలు తప్పవు…
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.