శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో మొదటిది తిరుచెందూర్. తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి పరమశివుని పూజించిన పవిత్రమైన , చాలా శక్తివంతమైన క్షేత్రం. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఇక్కడ స్వామివారి విభూది ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల విశ్వాసం..
స్కాంద పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన
తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం తమిళనాడు లో తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్ల దూరం సముద్ర తీరంలో ఉంది. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్‌లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరంలో కొలువయ్యాడు. ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో చూస్తే కానీ ఆ మహిమ తెలుసుకోలేరు. ఈ ఆలయం గురించి స్కాంద పురాణంలో జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు ఓలారి సుబ్రహ్మణ్య దర్శనం కోసం తిరుచెందూర్ వెళ్లారు. ఆలయం బయట కూర్చున్న ఆయనకు ధ్యానంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం అయింది. ఆ సమంలో శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు.
సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం చదివితే
సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం నిత్యం చదువుకుంటే సర్పదోషం తొలగిపోతుందని చెబుతారు. మనం తప్పుచేయకపోయినా ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితాన్ని చాలా రకాలుగా అనుభవిస్తుంటారు. ఉదాహరణకు, సంతానం కలుగక పోవడం, కుష్ఠ రోగం… ఇలాంటి దోషాలు పోగొట్టేందుకు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవాలి. ఈ తిరుచెందూర్ క్షేత్రం మరో లీల ఏంటంటే 2006 లో వచ్చిన సునామి వల్ల ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా, కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు.
తిరుచెందూర్ విభూతి మహిమ
ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి. స్వామి వారి అభిషేకము కోసం పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ క్షేత్రము వెడితే ఈ అభిషేకం తప్పక దర్శించగలరు. అద్భుతం గా ఉంటుంది. ఇవి కాక ఇంకా అష్టోత్తర అర్చన, సహస్రనామ అర్చన మొదలైన సేవలు ఉన్నాయి.
గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..