భారత్ శాంతి కాముక దేశం. అవసరమైతే మినహా యుద్ధానికి దిగకూడదని, బలప్రయోగం చేయకూడదని భావించే దేశం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేళ్లుగా అనేక దేశాలతో ఈ దిశగానే సంబంధాలు పెట్టుకున్నారు. కేవలం పాకిస్థాన్ దుశ్చర్యలకు అడ్డకట్ట వేసే దిశగానే సర్జికల్ దాడులు చేశారు మనహా ఆ దేశంపై దండెత్తాలన్న ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి ఎన్నడూ లేదు. మన జోలికొస్తే ఎలా బుద్ధిచెబుతామో మోదీ ప్రభుత్వం చేసి చూపించిందంతే…
రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో…
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముదిరిన వేళ అంతర్జాతీయ సమాజానికి అనేక అనుమానాలు కలిగాయి. యుద్ధం త్వరగా ముగిసిపోతుందని ఎదురుచూసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ కూ ఎదురు దెబ్బలు తగిలాయి. లొంగిపోవాల్సిన ఉక్రెయిన్ గట్టిగా ప్రతిఘటించింది. కొన్ని భూభాగాల్లో ఉక్రెయిన్ పైచేయిగా నిలిచింది. రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ ఆర్మీ చుట్టుముట్టింది. దీనిపై పుతిన్ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పైగా ఉక్రెయిన్ డర్టీ బాంబును వినియోగించేందుకు సిద్ధమైందని కూడా ఆరోపించారు. ఈ క్రమంలో అణుక్షిపణులు సిద్ధంగా చేయాలని పుతిన్ తమ ఆర్మీకి ఆదేశాలిచ్చినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. ఈ ఘటనలు 2022 మధ్యలో జరిగాయి….
మోదీకి అమెరికా విజ్ఞప్తి…
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపైనా, దానిలో మారణహోమాన్ని తగ్గించే చర్యలపైనా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. యుద్ధం ముగిసి పోవాలని, శాశ్వత శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూనే పరిస్థితి చేయిదాటిపోకుండా చూసేందుకు ప్రయత్నించారు. యుద్ధం ఆగాలంటే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, చొరవ చాలా అవసరమని జో బైడెన్ గుర్తించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. అణు క్షిపణులు ప్రయోగించేందుకు పుతిన్ సిద్ధమవుతున్నారని, మోదీ జోక్యం చేసుకుంటే అలాంటి ప్రయత్నాలు ఆగుతాయని బైడెన్ అభిప్రాయపడ్డారు. దానితో మోదీ, భారత విదేశాంగ శాఖను, దౌత్య అధికారులను రంగంలోకి దించి..ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ప్రయత్నించారు..
పుతిన్ కు మోదీ గట్టి సందేశం..
ఈ చర్చలు కొనసాగుతుండగానే 2022 సెప్టెంబరులో ఉజ్బెకిస్తాన్ వేదికగా ఎస్సీఓ సదస్సు జరిగింది. అక్కడ మోదీ, పుతిన్ కలిసే అవకాశం వచ్చింది.. అప్పుడు పుతిన్ తో మోదీ అన్న మాట ఇప్పటికీ ప్రపంచ దేశాల దౌత్యవేత్తల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఇదీ యుద్ధ శకం కాదని, యుద్ధ కాండను కొనసాగించడం సహేతుకం కాదని మోదీ నేరుగానే పుతిన్ తో చెప్పేశారు. సాధారణ పౌరుల మరణాలకు కారణమైన యుద్ధం వాంఛనీయం కాదని కూడా మోదీ ప్రకటించేశారు. దీనితో పుతిన్ పునరాలోచనలో పడ్డారు. అణు క్షిపణుల ప్రయోగం వల్ల ఇరుపక్షాలకు నష్టం వాటిల్లుతుందని సమీక్షించారు. తాము ఒకటి వేస్తే ఉక్రెయిన్ రెండు అణు బాంబులు వేసే ప్రమాదం ఉందని గుర్తించి ఆ ఉద్దేశాన్ని విరమించుకున్నారు. ఈ క్రమంలో హిరోషిమా, నాగసాకి తర్వాత తొలి సారి అణు బాంబు భయం నుంచి ప్రపంచ మానవాళి తప్పించుకున్నట్లయ్యింది. మన ప్రధాని మోదీ ప్రయత్నాలు ఫలించడంతో అమెరికా సహా అనేక ప్రభుత్వాలు ఆయన సేవలను ప్రశంసించాయి..