మహిళలు మరీ ఎక్కువగా వ్యాయామం చేసేస్తున్నారా!

అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం పురుషులు వారానికి 300 నిమిషాల ఏరోబిక్ వ్యాయామం చేయగలరు. కానీ మహిళలు అందులో సగం మాత్రమే చేయాలట. ఎందుకు ఈ లెక్కలు? మహిళలు కూడా పురుషులతో సమానంగా వ్యాయామం చేస్తే ఏమవుతుంది? అధ్యయనాల్లో ఏం తేలింది?

అధ్యయనంలో ఏముందంటే…
పురుషులతో పోలిస్తే మహిళల్లో కండర ద్రవ్యరాశి కొద్దిగా తక్కువగా ఉంటుంది. మహిళలు తక్కువ కండర ద్రవ్యరాశి కారణంగా ఎప్పుడూ కఠినమైన వ్యాయామాలు చేయలేరు. ముఖ్యంగా అధిక బరువుతో వ్యాయామం చేస్తే రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తక్కువ బరువుతో వ్యాయామం చేయడం ప్రారంభిస్తే శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఫలితంగా మహిళల ఊపిరితిత్తులు, పల్స్, కార్డియోపల్మనరీ (సీపీఆర్) పనితీరు మెరుగ్గా పని చేస్తుంది.నేషనల్ హెల్త్ 20 సంవత్సరాల పాటూ ఓ సర్వే నిర్వహించింది. దాదాపు 4 లక్షల మంది పెద్దలపై ఈ సర్వే చేశారు. పురుషుల కంటే మహిళలకు తక్కువ వ్యాయామం అవసరమని ఇందులో తేలింది.

అధ్యయనంతో ఏకీభవించని ఫిట్ నెస్ నిపుణులు
అయితే దీనిపై మరింత పరిశోధనలు అవసరం అని భావిస్తున్నారు నిపుణులు. దీనిపై ఫిట్ నెస్ నిపుణులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వ్యక్తి శరీరానికి ఒక్కోరకమైన వ్యాయామాలు అవసరమన్నది వారి అభిప్రాయం. ఒకరు ఎంత వర్కవుట్ చేయగలరు అనేది వారి శరీర బలాన్ని బట్టి ఉంటుంది. అయితే మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల వారు తరచూ రకరకాల వ్యాధుల బారిన పడుతుంటారు అందుకే మహిళలు తమ కండర ద్రవ్యరాశిని, ఎముక సాంద్రతను పెంచుకోవాలి. ప్రతి మహిళ శరీరంలో టెస్టోస్టెరాన్ లోపం వల్ల ఎముకల సాంద్రత క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అందుకే మహిళలు తక్కువ సమయం వ్యాయామం చేయాలంటారు..

వ్యాయామం ముఖ్యమే…
సాధారణంగా చాలామంది మహిళలు ఇంటిపని, బాధ్యతలతో తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోరు. ఈ పనులతోనే సమయం సరిపోతోంది..ఇంక వ్యాయామానికి టైమెక్కడ అంటుంటారు. కొందరైతే ఇంటిపని, ఆఫీసుపని చక్కగా నిర్వర్తిస్తూ చాలా చురుకుగా ఆరోగ్యంగా ఉన్నాం.. ఇంకా ప్రత్యేకంగా ఎక్సర్‌సైజులెందుకు అనుకుంటారు. కానీ అదే పొరపాటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ధోరణి అనారోగ్యానికి ఆహ్వానం పలకడమే అంటున్నారు. అంతేకాదు చాలామంది మహిళలు ఊబకాయంతో సతమతమవుతుంటారు. ఇలాంటి వారికి వ్యాయామం తప్పనిసరి అంటున్నారు. మీరు ఎంతవరకూ వ్యాయామం చేయగలరు అనేది మీ ఫిట్ నెస్ స్థాయిపై ఆధారపడి ఉంటుంది…

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.