సంచలన తీర్పులు ఇచ్చే కోల్ కతా హైకోర్టు జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్ ముందు ప్రకటించినట్లుగానే బీజేపీలో చేరారు. తృణమూల్ నేతలకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినందుకు బెంగాల్ అధికార పార్టీ ఇప్పుడు ఆయనపై విరుచుకుపడటం సహజమే అవుతుంది.మాస్క్ తీసేసి నిజస్వరూపం చూపించారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ఆరోపించారు. ఇక నుంచి జనం జడ్జిలుగా వ్యవహరిస్తూ గంగోపాధ్యాయ్ తప్పులను నిలదీస్తారని ఆమె అన్నారు. అభిజిత్ విషయంలో ప్రత్యర్థి పార్టీలు ఎన్ని మాట్లాడినా గతంలోనూ జడ్జిలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి…
రెండు పడవలపై బహరూల్ ఇస్లాం కాళ్లు
ఒకప్పుడు బహరూల్ ఇస్లాం అనే రాజకీయవేత్త ఉండేవారు. ఆయన రాజ్యసభకు, గువహాటీ హైకోర్టుకు మధ్య దారి ఏర్పరచుకున్నారు.రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ అకస్మాత్తుగా రాజీనామా చేసిన బహరూల్ ఇస్లాం గువహాటీ హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. తర్వాత ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయ్యారు. అక్కడ కూడా రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ సంగతి మరిచిన కాంగ్రెస్ , తృణమూల్ పార్టీలు టెక్నికల్ అంశాల ఆధారంగా అభిజిత్ గంగోపాధ్యాయను తప్పుపడుతున్నాయి.
చాగ్లా, హిదయతుల్లా కూడా జడ్జిలే…
ఎంసీ చాగ్లా, బోంబే హైకోర్టు జడ్జిగా ఉండేవారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆయన 1963 నుంచి 1966 వరకు భారత విద్యా శాఖామంత్రిగా పనిచేశారు. తర్వాత 1967 వరకు విదేశాంగ శాఖను నిర్వహించారు. 1968 నుంచి 1970 వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న మొహ్మద్ హిదయతుల్లా…కొంతకాలం ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు. ఏకకాలంలో చీఫ్ జస్టిస్, వైస్ ప్రెసిడెంట్ గా సేవలందించినదీ కూడా ఆయనే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వీఆర్ కృష్ణఅయ్యర్ కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ఆ తర్వాత కృష్ణ అయ్యర్, సుప్రీం కోర్టు జడ్జి కావడానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. రాజకీయ సంబంధాలున్న వ్యక్తి న్యాయ విభాగంలో ఉండటం కంటే…జడ్జిలు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం పెద్ద నేరమేమీ కాదు కదా…
కూలింగ్ ఆఫ్ పీరియడ్ లేదుగా…
రాజకీయాల్లోకి వచ్చిన అభిజిత్ గంగోపాధ్యాయ్ పై ఆరోపణలు రావడానికి ఒక కారణమైతే ఉంది. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాల పాటు ఎలాంటి రాజకీయ పదవి తీసుకోకూడదు. దాన్నే కూలింగ్ ఆఫ్ పీరియడ్ సంప్రదాయమని అంటారు. జడ్జి అభిజిత్ దాన్ని పాటించకుండానే రాజీనామా చేసిన వెంటనే రాజకీయాల్లోకి వచ్చేశారు. గతంలో దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించినట్లుగా రిటైర్మెంట్ కు ముందు న్యాయమూర్తులిచ్చిన తీర్పులకు రిటైర్మెంట్ తర్వాత వాళ్లు పొందే పదవులకు లింకు ఉంటుందన్న వాదనలు చాలా రోజులుగా ఉన్నాయి. అయితే అభిజిత్ గంగోపాధ్యాయ అలాంటి వారా అంటే చెప్పలేము. ఎందుకంటే ఆయన ఎన్నో నిష్ఫక్షపాతమైన తీర్పులిచ్చారో తప్ప.. ఎవరినీ ప్రశంసించేలేదు. ఒకవైపుకు వెళ్లలేదు..