అత్యంత ఎత్తైన శివాలయం ఎక్కడుందో తెలుసా!

పరమేశ్వరుడికి ఎన్నో రూపాలు, పేర్లు ఉన్నాయి. కానీ శంకరుడిని లింగరూపంలోనే పూజిస్తారు. దేశవ్యాప్తంగా శివుడికి ఎన్నో ఆలయాలున్నాయి. ప్రతి ఆలయం వెనుకా ప్రాముఖ్యత వేరే. అయితే ప్రపంచంలోనే ఎత్తైన ఆలయం ఎక్కడుందో తెలుసా…

తుంగనాథ్ ఆలయం
హిమాలయాల్లోని తుంగనాథ పర్వతశ్రేణులలో భాగంగా చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి చూస్తే నలువైపులా మంచుపర్వతాలే కనిపిస్తాయి. ఈ ప్రశాంత వాతావరణం చూసి చంద్రుడు పరవశించిపోయాడట. ఆ పరవశంలోనే సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడు. అందుకే ఈ పర్వతానికి చంద్రశిల అన్న పేరు వచ్చిందని చెబుతారు. శివుని బాహువులు పడిన చోటే తుంగనాథ్‌ క్షేత్రం. హిమాలయాలలోని సమున్నత పర్వతశ్రేణికి అధిపతి కాబట్టి ఇక్కడి శివుడిని తుంగనాథుడు అన్న పేరుతో పిలుచుకుంటారు. ఈ ఆలయం 12 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఓ వైపు మందాకినీ నది, మరో వైపు అలకనంద నది పారుతుండగా మధ్యలోని చంద్రశిల కొండ మీద ఉండే తుంగనాథ్‌ ఆలయాన్ని చేరుకోవడం ఓ అద్భుతమైన అనుభూతి.

పాండవులకి ఈ క్షేత్రంతో లింకేంటి
పంచ కేదారార క్షేత్రాల్లో ఒకటి తుంగనాథ్. ఈ పంచ కేదార క్షేత్రాలు ఏర్పడడం వెనుక ఓ గాథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులు, బంధువులను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానకి శివుడి దర్శనానికి వెళ్లారు. అయితే భోళాశంకరుడు మాత్రం పాండవులకు తన దర్శనభాగ్యం కల్పించడు. కాశీని వదిలి ఉత్తరదిశగా హిమాలయాలకు వెళ్లిపోతాడు. పట్టువదలని పాండవులు..శివుడి దర్శనార్థం వెళతారు. అలా తిరుగుతూ తిరుగుతూ నందిరూపంలో ఉన్నాడని గుర్తిస్తారు. అప్పుడు ఆ నందిని పట్టుకునేందుక భీముడు ప్రయత్నించగా..శివుడు వేరు వేరు శరీరభాగాలతో ఐదు ప్రదేశాల్లో దర్శనమిస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుడి శరీర భాగాలు పడిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా వెలిశాయి. వీటినే శివ పురాణంలో పంచ కేదారాలుగా చెప్పారు.

ఏప్రిల్ నుంచి ఆగస్టు సందర్శనకు అనువైన సమయం
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సర్వే తర్వాత, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, తుంగనాథ్ ఆలయం జాతీయ స్మారక చిహ్నంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయంలో పార్వతీ దేవి, వినాయకుడు, ఇతర దేవుళ్లు, దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. తుంగనాథ్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం ఏప్రిల్ నుంచి ఆగస్టు. ఈ సమయంలో అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. తుంగనాథ్ మాత్రమే కాదు ఆ చుట్టపక్కలున్న స్థలాల సందర్శనకు ఇదే అనువైన సమయం.

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..