కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముద్రగడ కుటుంబం ఇక్కడ ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించగా పర్వత కుటుంబం నాలుగు, పరుపుల కుటుంబం నుంచి మూడుసార్లు ఎంఎల్‌ఎలుగా పని చేశారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు ఉన్న ముద్రగడ పద్మనాభం నాలుగుసార్లు, ఆయన తండ్రి వీర రాఘవరావు రెండు సార్లు ఎంఎల్‌ఎగా పని చేశారు.
అభ్యర్థిని మార్చిన వైసీపీ
గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పర్వత పూర్ణచంద్రప్రసాద్, టిడిపి నుంచి వరుపుల రాజా బరిలో ఉండగా హోరాహోరీ పోరులో పర్వత విజయం సాధించారు. అయితే ప్రసాద్‌పై సొంత వర్గం వారే తీవ్ర వ్యతిరేకత చూపారు. సొంత పార్టీ కేడర్ ఆయనను బహిరంగంగానే విమర్శిస్తూ వచ్చారు. ఆయన తీరు నచ్చక కొందరు ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా రాజీనామాలు సైతం చేశారు. అధిష్ఠానంకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే పలు సర్వేలు, వ్యతిరేకత నేపథ్యంలో వైసిపి ప్రసాద్‌ను తప్పించి మాజీ ఎంఎల్‌ఎ వరుపుల సుబ్బారావును ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ప్రత్తిపాడు వైసిపి నియోజకవర్గంలో ముసలం నెలకొనడంతో కొంతమంది కేడర్ పర్వత వైపు నుంచి వరుపుల వైపుకి మళ్లారు. సంక్షేమ పథకాలను వివరించి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా వరుపుల సుబ్బారావు అడుగులు వేస్తున్నారు. అయితే ఇక్కడ వైసిపిలో ఉన్న వర్గపోరు ఆ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా.
వరుపుల రాజా సతీమణికి టీడీపీ టిక్కెట్
డిసిసిబి మాజీ అధ్యక్షుడు వరుపుల రాజా అకాల మరణంతో ఆయన సతీమణి సత్యప్రభ ఇక్కడ టిడిపి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహారిస్తున్నారు. ఆమె ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. సానుభూతి కలిసి వస్తుందని, వైసిపి వ్యతిరేఖ ఓట్లు తమ విజయానికి సునాయాసంగా అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు. అయితే ఇటీవల టిడిపి అధిష్టానం అత్యధిక సీట్లు ప్రకటించినప్పటికీ ప్రత్తిపాడు సీటుని మాత్రం ప్రకటించలేదు. కానీ సత్యప్రభకు లైన్ క్లియర్ అయిందని ఆమె శ్రేణులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ నేతల ద్వారా ప్రలోభాల పర్వం ఎక్కువగా ఉంటుందని, మహిళ కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేయాలంటే ఉన్న కొన్ని ఇబ్బందులు దృష్ట్యా ఆమె విజయ అవకాశాన్ని ఏ విధంగా చేరుకోగలదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
వైసీపీలో చేరుతున్న ముద్రగడ – చాన్సిస్తారా ?
ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారు., ఇప్పుడు ఆయన కుమారుడు గిరిబాబుకు రాజకీయ జీవితం ఇవ్వాలనుకుంటున్నారు. అందు కోసం.. పార్టీ లో చేరుతున్నారు. గిరిబాబుకు ప్రత్తిపాడు టిక్కెట్ ఇచ్చే అవకాశాలను కొట్టేయలేమని వైసీపీ వర్గాలంటున్నాయి. ఈ కారణంగా అధికారికంగా ఏ పార్టీ అభ్యర్థి కూడా ప్రత్తిపాడులో ఇంకా ఖరారు కాలేదు.