లింగాయత్ ఓట్లపై బీజేపీ ప్రత్యేక దృష్టి

2019 లోక్ సభ ఎన్నికలను బీజేపీ ప్రామాణికంగా తీసుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధించేందుకు వ్యూహరచన చేస్తోంది. బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఉంది. తనకు అనుకూలంగా ఉండే అంశాలను పరిశీలిస్తూ, కర్ణాటకలో అన్ని సీట్లు గెలవాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

అసెంబ్లీ వేరు, లోక్ సభ వేరు…

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టి లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు, నేతలు పనిచేయాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశించింది. రెండు ఎన్నికల్లో దక్షిణాదిన ఓటింగ్ సరళి వేరుగా ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. కర్ణాటకలో 28 లోక్ సభా స్థానాలుంటే గత ఎన్నికల్లో బీజేపీ 25 చోట్ల గెలిచింది. బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్ సుమలత విజయం సాధించారు. అప్పటి కాంగ్రెస్ – జేడీఎస్ పొత్తుకు కేవలం చెరో సీటు వచ్చాయి.

సామాజిక లెక్కలతో అభ్యర్థుల ఎంపిక…

కర్ణాటకలో సామాజిక సమీకరణాలు ఆధారంగానే ఓటింగ్ జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లింగాయత్, ఒక్కళిక సామాజిక వర్గాలు ఎవరికి ఓటేస్తే వాళ్లే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం లేదా లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడం చాలా కాలంగా జరుగుతున్నదే. ఇప్పుడు కూడా బీజేపీ అదే ఆలోచనతో ఉంది. ముఖ్యంగా లింగాయత్ సామాజికవర్గం మొదటి నుంచి బీజేపీని సమర్థిస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లు దూరమైనందునే ఓడిపోయామని కమలనాథులు విశ్వసిస్తున్నారు. ఈ సారి మాత్రం లింగాయత్ లను ప్రసన్నం చేసుకుంటే మొత్తం లోక్ సభా స్థానాలు కొట్టేయ్యాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నేతలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మాయ్, జగదీష్ షెట్టార్లకు లోక్ సభ నామినేషన్ ఇవ్వాలని పార్టీ డిసైడైంది. బొమ్మాయ్ ప్రస్తుతం షిగ్గోన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను హవేరీ లోక్ సభా నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు. అక్కడ లింగాయత్ జనాభా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత హవేరీ నియోజకవర్గం లోక్ సభ సభ్యుడు శివకుమార్ ఉదాసీ..ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఇక జగదీష్ షెట్టార్ ను బెళగావి నుంచి పోటి చేయిస్తారు. కేంద్ర మాజీ మంత్రి సురేష్ అంగాడీ సతీమణి మంగళ అంగాడీ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఈ సారి ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు.

ప్రచారంలో యడ్యూరప్ప కీలక పాత్ర ?

మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప కూడా లింగాయత్ వర్గానికి చెందిన నాయకుడే. లింగాయత్ సామాజిక వర్గం అభ్యర్థులను గెలిపించే బాధ్యతను యడ్యూరప్ప చేతిలో పెట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. కర్ణాటకలో పోటీ చేసే 28 మంది అభ్యర్థుల జాబితాను ఇప్పటికే అమిత్ షా , నడ్డా సమీక్షించారని యడ్యూరప్ప చెబుతున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆ జాబితాను ప్రకటిస్తారు. ఈ సారి కనీసం 10 నుంచి 12 మంది సిట్టింగులను మార్చుతారని ప్రచారం జరుగుతోంది. మరో పక్క బీజేపీకి పొత్తు భాగస్వామిగా జేడీఎస్ పోటీ చేయడంతో ఓట్ షేర్ బాగా పెరుగుతుందని ఎదురు చూస్తున్నారు. జేడీఎస్ ఈ సారి మాండ్యా, హసన్ , కోలార్ లోక్ సభా నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది..