అక్కడ టీడీపీ అభ్యర్థి మాత్రమే పార్టీలో మిగులుతారా ? సాలూరులో సర్దుకుంటున్న నేతలు

సాలూరు నియోజకవర్గంలో అధికారపార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కి శ్రీకారం చుట్టింది. ఇంతవరకు టిడిపి నుంచి నాయకుల చేరికలకు తలుపులు తీయని వైసిపి నాయకత్వం ఇప్పుడు బార్లా తెరిచేందుకు సిద్ధమైంది. పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు జారిపోకుండా ముందు జాగ్రత్తలు చేపడుతోంది. ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తామంటున్న నాయకులకు ద్వారాలు తెరిచింది. దీనిలో భాగంగా పట్టణానికి చెందిన కీలక టిడిపి నాయకుడి చేరికతో ఆపరేషన్‌ ఆకర్ష్‌కి శ్రీకారం చుట్టనున్నారు.

టీడీపీ అభ్యర్థిగా సంధ్యారాణి ప్రకటన – టీడీపీ నేతల అసంతృప్తి

కొంతకాలంగా ఆ పట్టణ నాయకుడు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సంధ్యారాణితో విభేదించి పార్టీకి దూరంగా ఉన్నారు. గతంలో ఆయన భార్య మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా పనిచేశారు. టిడిపి అభ్యర్థిగా సంధ్యారాణి పేరు అధిష్టానం ప్రకటించడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. టిడిపిలో ఇమడలేక అధికారపార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర ఐదోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. ఎమ్‌పిగా పోటీ చేయాలన్న ఆయన కోరికను పార్టీ అధిష్టానం అంగీకరించే పరిస్థితి లేదు. దీంతో ఆయన అసెంబ్లీ సమరానికి రంగం చేసుకుంటున్నారు. దీని కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

చేరికల్ని ప్రోత్సహిస్తున్న డిప్యూటీ సీఎం

సుమారు 17 సంవత్సరాలుగా నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగిన రాజన్నదొర అనుకూల, ప్రతికూల అంశాలపై దృష్టి సారించారు. డిప్యూటీ సిఎంగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా తన పనితీరు పట్ల ఎక్కడైనా నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తే వారికి తగిన భరోసా ఇచ్చి దారికి తెచ్చుకొనే ప్రక్రియలో తలమునకలై ఉన్నారు. మరో వైపు ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను అక్కున చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని కోసం పట్టణ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుల ద్వారా ఆపరేషన్‌ ఆకర్ష్‌ని వేగవంతం చేయాలని భావిస్తున్నారు.

టీడీపీ క్యాడర్ ను పార్టీలో చేర్చుకుని దెబ్బకొట్టాలని వ్యూహం

నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి సంధ్యారాణిని వ్యతిరేకిస్తున్న నాయకులు, కార్యకర్తలపై అధికారపార్టీ దృష్టిసారించింది. మరోవైపు మండలాల్లో కూడా వైసిపి కేడర్‌ చెక్కు చెదరకుండా ఉండేందుకు డిప్యూటీ సిఎం రాజన్నదొర ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రానున్న కొద్ది రోజుల్లో చేరికల మేళా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.