సీబీఐ కస్టడీకి షాజహాన్ షేక్, తృణమూల్ కు కష్టకాలం

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఆగడాలకు కోల్ కతా హైకోర్టు అడ్డుకట్టలు వేస్తోంది. ఆ పార్టీ ఇష్టానుసారం ప్రవర్తించడం కుదరదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అసాధ్యమని గౌరవ కోర్టు తేల్చిచెప్పింది. ఈ క్రమంలో సందేశ్ ఖళీ హింసాకాండపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది..

చీవాట్లు పెట్టిన హైకోర్టు

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాతే షాజహాన్ షేక్ ను తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. విచారణకు వచ్చిన ఈడీ అధికారులపై అతని అనుచరులు దాడి చేసిన సంఘటన జరిగి దాదాపు రెండు నెలలైంది. నలుగురు ఈడీ అధికారులను విపరీతంగా కొట్టి గాయపరచడంతో పాటు వారి వద్ద ఉన్న వాచీలు, బంగారు గొలుసులను కూడా లాక్కొన్నారు. ఏకంగా 800 మంది తృణమూల్ కార్యకర్తలు , ఈడీ అధికారులపై దాడులు చేశారు.ఆ సమయంలో బెంగాల్ పోలీసులు కూడా చోద్యం చూశారు. దీనితో కేంద్రం సీరియస్ అయిన నేపథ్యంలో షాజహాన్ షేక్ పరారయ్యారు. 55 రోజుల తర్వాత సామాజిక వత్తిడితో ఆయను సరెండర్ అయ్యారు. అయితే అరెస్టు చేసినట్లు పోలీసులు కేసు రాసుకున్నారు. అతనిపై విచారణ సీబీఐకి అప్పగించగా, తొలుత షాజహాన్ ను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించేందుకు బెంగాల్ ప్రభుత్వం నిరాకరించింది. సీబీఐకి బెంగాల్ పోలీసులు సహకారం అందించలేదు. దానితో సీబీఐ అధికారులు కోల్ కతా హైకోర్టులో పిటిషన్ వేయగా, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, ఖాకీల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దానితో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈడీపై దాడులకు సంబంధించిన కేసులో షాజహాన్ షేక్ ను సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సీబీఐ కస్టడీకి తీసుకున్నారు.

మమత ప్రభుత్వ పక్షపాత ధోరణి

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వ తీరుపై కోల్ కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐకి సహకరించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కన్నెర్ర జేసింది. నిందితుడిని సీబీఐకి అప్పగించాల్సిన నేపథ్యంలో అలా ఎందుకు చేయలేదని నిలదీసింది. ఇలాంటి చర్యలు ఆక్షేపణీయమని ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు చీవాట్ల తర్వాతే బెంగాల్ ప్రభుత్వం దారికి వచ్చి షాజహాన్ షేక్ ను సీబీఐ కస్టడీకి ఇచ్చింది..

సందేశ్ ఖళీ హింసాకాండపై ప్రధాని మోదీ ఆగ్రహం

సందేశ్ ఖళీలో ఆదివాసీల భూములు లాక్కుని వారిపై అత్యాచారాలకు పాల్పడిన ముఠాకు హాజహాన్ షేక్ నాయకుడని ఆరోపణలు వస్తున్నాయి. ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు కూడా అక్కడి మహిళలు భయపడుతున్నారు. రెండు రోజుల క్రితం బెంగాల్ పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ, సందేశ్ ఖళీ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. సందేశ్ ఖళీలో రగిలిన జ్వాల బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దహించి వేస్తుందని ఆయన హెచ్చరించారు. బాధిత మహిళలతో భేటీ అయిన ప్రధాని మోదీ, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.