బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా మరో మాస్టర్ స్ట్రోక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడంతో పాటు భావసారూప్యను పెంచుకున్న పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్డీయేకు 400 ప్లస్ అన్న నినాదంతో కొత్త పార్టీలను తమలో కలుపుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు ఒడిశా విషయంలో మోదీ గేమ్ కాంగ్రెస్ కు దిమ్మతిరిగేదిగా ఉందనే చెప్పాలి….
నవీన్ పార్టీతో తుది దశలో చర్చలు…
ఒడిశాలో అధికారపార్టీ బీజేడీతో బీజేపీ పొత్తు చర్చలు ఒక కొలిక్కివచ్చాయని ఇరు పార్టీల వ్యూహకర్తలు ప్రకటించారు. తొలుత ఒడిశా రాజధాని భువనేశ్వర్, తర్వాత ఢిల్లీలో జరిగిన చర్చల నేపథ్యంలో సీట్ల పంపకాలపై కూడా అవగాహన దాదాపుగా కుదిరినట్లు చెబుతున్నారు. ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలున్నాయి. ప్రస్తుతానికి బీజేపీ చేతిలో 8, బీజేడీకి 12, కాంగ్రెస్ కు ఒక ఎంపీ ఉన్నారు. ఈ సారి పొత్తులో భాగంగా తమకు 14 లోక్ సభా స్థానాలు కావాలని బీజేపీ కోరుతోంది. ఫైనల్ గా బీజేపీ 12, బీజేడీ 9 చోట్లు పోటీ చేసే ఛాన్స్ ఉందని రెండు పార్టీల నుంచి సమాచారం అందుతోంది. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే ఒడిశాలోని 147 స్థానాల్లో బీజేడీ 100, బీజేపీ 47 వరకు పోటీ చేసేందుకు ఒప్పందం కుదరవచ్చు. ప్రస్తుత అసెంబ్లీలో బీజేడీకి 112, బీజేపీకి 23 స్థానాలున్నాయి…
15 ఏళ్ల తర్వాత ఘర్ వాపసీ
2009 వరకు బీజేడీ కూడా ఎన్డీయేలో ఉండేది. నవీన్ పట్నాయక్ ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించేవారు. అప్పట్లో జరిగిన కందమహల్ ఘర్షణలకు నిరసనగా బీజేడీ.. కేంద్రంలోని ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఐదు సార్లు ఆ పదవిని నిర్వహించి ఇప్పుడు ఆరో సారి గెలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 78 ఏళ్ల నవీన్ పట్నాయక్ ఇప్పుడు బాధ్యతలు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. బీజేపీతో పొత్తు ఉంటే బీజేడీకి కూడా మేలు జరుగుతుందని ఆయన ఎదురుచూస్తున్నారు….
ఒడిశా సంక్షేమం కోసమే….
2036 నాటికి ఒడిశా రాష్ట్ర హోదా పొంది వందేళ్లు పూర్తవుతుంది. అప్పటికల్లా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు నవీన్ ప్రయత్నిస్తున్నారని, ఆ దిశగా రాజకీయ సర్దుబాట్లకు కూడా అడుగులు వేస్తున్నారని బీజేడీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవీ ప్రసాద్ మిశ్రా ప్రకటించారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు బీజేడీ మద్దతు పలికింది. బీజేపీ అలాంటి మద్దతివ్వడం కూడా ఇటీవలి కాలంలో ఇది రెండో సారి. పైగా రెండు సార్లు అశ్వినీ వైష్ణవ్ కే మద్దతు ఇచ్చారు. ఇటీవల జరిగిన ఒడిశా మాజీ సీఎం బిజు పట్నాయక్ 108వ జయంతి వేడుకలకు ప్రధాని మోదీ హాజరై.. ఆయన సేవలను ప్రస్తుతించారు. కాంగ్రెస్ పాలన నుంచి ఒడిశాకు విముక్తి కలిగించిన నాయకుడిగా పొగిడారు. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని బీజేడీకి ఆయన పిలుపునిచ్చారు. మరో పక్క ఒడిశాలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగానే ఉంది. ఆ పార్టీకి ఒక ఎంపీ, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు…