దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకే నేతలు వెనుకాడుతున్నారు. ఓడిపోయేందుకు పోటీ చేయడమెందుకన్న ఆలోచన వారిలో వస్తోంది. సంపన్న శాసనసభ్యులు, పార్లమెంటేరియన్లు ఉన్న కర్ణాటకలో కూడా పోటీకి నేతలు ఆమడ దూరంలో నిల్చుంటున్నారు. డబ్బు ఖర్చు పెట్టుకుని అభాసుపాలు కావడం మినహా చేయగలిగిందేమీ లేదని కన్నడ కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. అక్కడ బీజేపీకి ఉన్న బలాన్ని బట్టి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు దుర్లభమని తేలిపోయింది…
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా…
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. సిద్దరామయ్య మరోసారి సీఎం అయ్యారు. పెద్ద ఫైనాన్షియర్ డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ నేతలు పోటీకి సుముఖత వ్యక్తం చేయడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. 2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 లోక్ సభా స్థానాల్లో బీజేపీకి 25 దక్కాయి. 2004లో ఆ పార్టీకి 17 సీట్లు వచ్చాయి. అప్పటి నుంచి లోక్ సభ ఎన్నికల వరకు బీజేపీ బలంగానే ఉంది. పైగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని చూసి ఓటేస్తామని సగటు కన్నడ ఓటరు చెబుతున్నాడు. దానితో కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచడం లేదు…
మంత్రులను బతిమాలుతున్న సిద్దరామయ్య..
కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తన సొంతూరు గుల్బర్గా లోక్ సభా స్థానంలో ఓడిపోయారంటే కర్ణాటకలో బీజేపీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏడు సార్లు కోలార్ ఎంపీగా గెలిచిన కేహెచ్ మునియప్ప కూడా పరాజయం పాలయ్యారు. ఇప్పుడాయన సిద్దరామయ్య కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఐటీ దిగ్గజం నందన్ నీలేకనీని 2014లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే ఆయన కూడా ఓడిపోయి, కర్ణాటకలో కాంగ్రెస్ కు ప్రయోగాలు ఫలించవని నిరూపించారు. దానితో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు మంత్రులను సిద్దరామయ్య బతిమాలుకుంటున్నట్లు సమాచారం. నటుడు, దివంగత మాజీ కేంద్ర మంత్రి అంబరీష్ సతీమణి సుమలతకు టికెట్ రాకపోవడంతో ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేసి బీజేపీ మద్దతుతో గెలిచారు. ఇప్పుడు అదే మాండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కేబినెట్ మంత్రి మహదేవప్పను పోటీ చేయాలని కోరుతుంటే ఆయన దణ్ణం పెట్టి వద్దంటున్నారు…
అధికారానికి వచ్చే అవకాశం లేక…
కాంగ్రెస్ పార్టీకి అన్ని రాష్ట్రాల్లో ఎదురుగాలి వీస్తోంది. దానితో కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. అలాంటి సందర్భంలో లోక్ సభకు పోటీ చేసి ప్రయోజనం ఏమిటని కన్నడ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించుకుంటున్నారు. గెలిచినా కేంద్ర మంత్రి పదవో, కేంద్ర పదవో రాదు కదా అన్నది వారి ఆలోచనా విధానం. పైగా గెలిచినా ఓడినా ప్రతీ అభ్యర్థి ఆరేడు అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీగా వ్యయం చేయాల్సి ఉంటోంది. పార్లమెంటు పోటీలో ఖర్చు తడిసి మోపెడవుతోందని నేతలు వాపోతున్నారు. దానికి బదులు కాస్త పార్టీ ఫండ్ ఇచ్చి ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే తర్వాత సంపాదించుకునే వీలుంటుందని కూడా వాళ్లు లెక్కలేసుకుంటున్నారు.