ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే)కు దేవుడంటే భక్తి లేదు. అది వాళ్ల ఇష్టం. అందులో కొందరు నాయకులు, వారి కుటుంబ సభ్యులు దొంగచాటుగా గుళ్లకు వెళతారన్నది కూడా నిజం. అది కూడా వారి ఇష్టం. కాకపోతే హిందువుల మనోభాగాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ వాళ్లు చేస్తున్న యాగీ మాత్రం అభ్యంతరకరం. అవకాశం వచ్చినప్పుడల్లా హిందూ ధర్మాన్ని కించపరిచి మాట్లాడటం వారికి అలవాటుగా మారింది. ఎన్ని చీవాట్లు పెట్టినా, ఎంత మందలించినా వారి బుద్ధి మారే అవకాశం కనిపించడం లేదు. తాజాగా ఎ. రాజా కూడా అదే పని చేసి ఇప్పుడు అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు..
ఏ రాజా వివాదాస్పద కామెంట్స్
2జీ స్కామ్ ఆరోపితుడు..డీఎంకే ఎంపీ ఎ. రాజా భారత దేశంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత్ ఎప్పుడూ ఒక దేశం కాదన్న ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటీవల ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ, భారత్ ఎప్పుడూ ఒక దేశం కాదని… ఎప్పుడూ ఒక దేశంగా లేదన్నారు. ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి వంటి లక్షణాలు ఉంటే ఒకే దేశం అంటారని వ్యాఖ్యానించారు. కానీ భారత్ అలా కాదని… భిన్న భాషలు, విభిన్న సంస్కృతులు కలిగిన రాష్ట్రాలు దేశంగా ఏర్పడ్డాయన్నారు. అందుకే ఇది దేశం కాదని… ఉపఖండం అని… ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందన్నారు. తనకు రాముడి పైనా… రామాయణం పైన విశ్వాసం లేదని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా బిల్కిస్ బానో అత్యాచార నిందుతులను సమర్థించే వాళ్లే జై శ్రీరామ్ అంటున్నారని కూడా రాజా ఎద్దేవా చేశారు. జై శ్రీరామ్ అనేందుకు తాను ఇష్టపడనని చెప్పుకున్నారు.
ఆ వ్యాఖ్యలకు కాంగ్రెస్ దూరం..
కేంద్రమంత్రిగా కూడా చేసిన రాజా ఇలా మాట్లాడుతున్నారేమిటని ఇండియా గ్రూపుకు నాయకత్వం వహించే కాంగ్రెస్ ముక్కున వేలేసుకుంది. రాముడు అందరి వాడని, రాముడు చూపిన మార్గం నడవడమే దేశ ప్రజల ముందున్న కర్తవ్యమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ అన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలన్నారు. అవి రాజా వ్యక్తిగత వ్యాఖ్యలంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కామెంట్ చేశారు.
ఇదేమి సంస్కారం అని ప్రశ్నిస్తున్న బీజేపీ….
రాజా తీరుపై కేంద్రంలోని అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించే బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేశాన్ని ముక్కలు చేసేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జీ అమిత్ మాలవీయ ఆరోపించారు. గతంలో మణిపూర్ పై డీఎంకే చేసిన వ్యాఖ్యలను సైతం ఖండించారు. ఉదయనిధి స్టాలిన్ , సనాతన ధర్మంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తర్వాత రాజా కూడా ఆయన బాటలో నడుస్తున్నారు. రాజా వ్యాఖ్యలతో సోనియా, రాహుల్, ఖర్గే ఏకీభవిస్తారా.. డీఎంకేను ఇండియా గ్రూపులో కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న..