ఆయన ఒకప్పుడు ఎమ్మెల్యే. మంచిగా పని చేశారు. పార్టీ కోసం కష్టపడ్డారు. తర్వాత ఆయన తన నమ్మకస్తుడ్ని తీసుకెళ్లి ఈయన మంచోడు సార్.. ఎంపీ సీటు ఇద్దాం అని అధినాయకుడ్ని కలిశారు. సరే ఇద్దామన్నారు కానీ రివర్స్ లో చెప్పారు.. ఎంపీగా నువ్ పోటీ చెయ్.. ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తారన్నారు. అలాగే చేశారు. కానీ ఎంపీగా ఓడిపోయారు.. మిత్రుడు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆ ఎంపీకి సీటు లేకుండా పోయింది. అంటే ఆయనను పకడ్బందీగా పక్కన పెట్టేశారన్నమాట. ఇది ఉండి టీడీపీలో కథ.
ఉండి టిక్కెట్ మళ్లీ రామరాజుకే
త ఎన్నికల్లో టీడీపీ నుంచి మంతెన రామరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో కృషి చేశారు. ఆయనకున్న ఫాలోయింగ్‌ను చూసిన పార్టీ అధిష్టానం.. 2019లో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. అయితే.. ఆ ఎన్నికల్లో శివరామరాజు ఓటమి పాలయ్యారు. అప్పుడు శివరామరాజు సూచనతోనే మంతెన రామరాజుకు ఉండి టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆయన.. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక క్యాడర్‌ను తయారు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే.. మరోసారి ఉండి నుంచే పోటీచేసే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తనకు బెర్త్ కన్ఫార్మ్ అయ్యిందని.. పోటీచేసేది తానేని ప్రకటించి ప్రచారం సైతం ప్రారంభించారు.
ఉండిలో టీడీపీ రాజుల మధ్య పోరాటం
ఇటీవలి కాలంలో ఇరువురు నేతల మధ్య అంతర్గతంగా పోరు మొదలైంది. ఉండి నుంచి మరోసారి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే… ఉండిలో శివరామరాజు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్నే సిట్టింగ్ ఎమ్మెల్యే వాడుతూ వస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సూచించడంతో.. ఎమ్మెల్యే మరోచోట టీడీపీ ఆఫీస్‌ను ఓపెన్ చేశారు. దీంతో ఏ కార్యాలయానికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు స్థానిక కార్యకర్తలు. మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు.. ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
శివరామరాజు వైసీపీలో చేరుతారా ?
గత ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేసినంత మాత్రాన తను సిట్టింగ్ కాకుండా పోనని.. ఉండి ప్రజల ఆశీర్వాదంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని శివరామరాజు చెబుతున్నారు. మరోవైపు.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు కూడా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ప్రణాళిక రచించుకుంటున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని.. ఇప్పటికే ఒకసారి ఛాన్స్ ఇచ్చిన వారికి అవకాశమెలా ఇస్తారని మంతెన రామరాజు అంటున్నారు. . టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉండి నియోజకవర్గంలో కేడర్ విడిపోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటని కార్యకర్తలు, అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.